హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి బదిలీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్‌పీఓ) అశ్విని సత్తారు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని విదేశీ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) వర్గాలు సమాచారం ఇచ్చాయి. అయితే ఆమెను ఎక్కడకు బదిలీ చేసింది వివరాలు తెలియరాలేదు. వారం రోజుల క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి బదిలీ ఉత్తర్వులు పంపినట్లు ఢిల్లీలోని ఎంఈఏ వర్గాలు తెలిపాయి. 2013 సెప్టెంబర్‌లో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారిగా అశ్విని సత్తారు హైదరాబాద్‌లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం అప్పటి పాస్‌పోర్ట్ అధికారి శ్రీకర్‌రెడ్డి బదిలీ కావడంతో పదోన్నతిపై హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అయ్యారు.
గతంలో ఆమె జర్మనీలోని ఇండియా రాయబార కార్యాలయంలో పనిచేశారు. అంతేగాదు నేపాల్, భూటాన్ దేశాల విదేశీ వ్యవహారాల బాధ్యతలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తన బదిలీని కొద్ది రోజులు ఆపాలని అశ్విని సత్తారు కేంద్ర కార్యాలయానికి లేఖ రాసినట్లు సమాచారం. కాగా ఈమె స్థానంలో కొత్త అధికారి ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.
డీపీఓనూ బదిలీ చేసిన ఎంఈఏ...
ఐదేళ్లుగా హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేస్తున్న మదన్‌కుమార్‌రెడ్డిని కూడా బదిలీ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో పనిచేసే ఈయన డిప్యుటేషన్‌పై ఇక్కడ డీపీఓగా పనిచేస్తున్నారు. వాస్తవానికి మూడేళ్లు డిప్యుటేషన్‌పై ఉండొచ్చు. ఇప్పటికే ఐదేళ్లు పూర్తయినందున బదిలీ చేసినట్టు విదేశీ వ్యవహారాల శాఖ అధికారి ఒకరు చెప్పారు.