Hyderabad regional passport officer
-
ఈ పాస్‌పోర్ట్ కేంద్రాల్లో శనివారం స్పెషల్ డ్రైవ్.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈనెల 26న శనివారం సేవలు కొనసాగనున్నాయి. ఈనెల 22వ తేదీన సాంకేతిక సమస్య తలెత్తటం వల్ల పలువురి అపాయింట్మెట్ రీషెడ్యూల్ చేశారు. అలాంటి వారికి ఈ రెండు జిల్లాల్లోని కేంద్రాల్లో శనివారం ప్రత్యేకంగా సేవలందించనున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటన చేశారు. రీషెడ్యూల్ చేసిన వారికి మొబైల్ ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించామని తెలిపారు. ‘22-11-2022(మంగళవారం) రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాంకేతిక సమస్యలు తలెత్తటం వల్ల హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని 5 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్‌కేఎస్), 14 పోస్ట్ ఆఫీస్ పాస్ట్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఓపీఎస్కేఎస్) సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించాం. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి సమాచారం ఇస్తామని తెలిపాం. అందులో భాగంగా 22న మంగళవారం ఎవరి దరఖాస్తులు నిలిచిపోయాయో వారికి ప్రత్యేకంగా శనివారం సేవలందించాలని నిర్ణయించాం. నల్లగొండ, ఖమ్మంలోని 5 పీఎస్‌కేఎస్, 2 పీఓపీఎస్కేఎస్లలో ఈ సేవలు కొనసాగనున్నాయి. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి ఎస్ఎంఎస్ పంపించాం.’ అని తెలిపారు దాసరి బాలయ్య. ఎస్ఎంఎస్లు అందిన దరఖాస్తుదారులు వారికి కేటాయించిన పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలకు షెడ్యూల్ టైమ్ ప్రకారం హాజరుకావాలని కోరారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు హైకోర్టు జడ్డిలు బదిలీ -
పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల కుదింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్లను 50 శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు సూపర్ స్పైడర్లుగా మారకూడదనే ఉద్దేశంతో ఈ నెల 31 వరకు 50 శాతం అపాయింట్మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామన్నారు. నిలిపివేసిన అపాయింట్మెంట్లలో మెడికల్, అత్యవసర ప్రయాణాలు ఉంటే సరైన డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. పాస్‌పోర్టు కార్యాలయంలోని ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..) -
హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి బదిలీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్పీఓ) అశ్విని సత్తారు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని విదేశీ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) వర్గాలు సమాచారం ఇచ్చాయి. అయితే ఆమెను ఎక్కడకు బదిలీ చేసింది వివరాలు తెలియరాలేదు. వారం రోజుల క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి బదిలీ ఉత్తర్వులు పంపినట్లు ఢిల్లీలోని ఎంఈఏ వర్గాలు తెలిపాయి. 2013 సెప్టెంబర్‌లో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారిగా అశ్విని సత్తారు హైదరాబాద్‌లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం అప్పటి పాస్‌పోర్ట్ అధికారి శ్రీకర్‌రెడ్డి బదిలీ కావడంతో పదోన్నతిపై హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అయ్యారు. గతంలో ఆమె జర్మనీలోని ఇండియా రాయబార కార్యాలయంలో పనిచేశారు. అంతేగాదు నేపాల్, భూటాన్ దేశాల విదేశీ వ్యవహారాల బాధ్యతలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తన బదిలీని కొద్ది రోజులు ఆపాలని అశ్విని సత్తారు కేంద్ర కార్యాలయానికి లేఖ రాసినట్లు సమాచారం. కాగా ఈమె స్థానంలో కొత్త అధికారి ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. డీపీఓనూ బదిలీ చేసిన ఎంఈఏ... ఐదేళ్లుగా హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేస్తున్న మదన్కుమార్రెడ్డిని కూడా బదిలీ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో పనిచేసే ఈయన డిప్యుటేషన్‌పై ఇక్కడ డీపీఓగా పనిచేస్తున్నారు. వాస్తవానికి మూడేళ్లు డిప్యుటేషన్‌పై ఉండొచ్చు. ఇప్పటికే ఐదేళ్లు పూర్తయినందున బదిలీ చేసినట్టు విదేశీ వ్యవహారాల శాఖ అధికారి ఒకరు చెప్పారు. -
ప్రపంచ వాణిజ్య సంస్థకు శ్రీకర్‌రెడ్డి బదిలీ
* ఆయన హయాంలోనే భారీగా పాస్‌పోర్ట్ సంస్కరణలు * 24 గంటల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్ ఇచ్చిన ఘనత కూడా సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ కె.శ్రీకర్‌రెడ్డి జెనీవాలోని ప్రపంచ వాణి జ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు బదిలీ అయ్యారు. ఇకపై డబ్ల్యూటీఓలో భారత దేశానికి సంబంధించి జరిగే వాణిజ్య కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లా మోత్కూర్ మండలం కొండగడపకు చెందిన శ్రీకర్‌రెడ్డి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2001లో ఐఎఫ్ఎస్కు ఎంపికై ఢిల్లీలోని విదేశాంగశాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేశారు. 2011లో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా నియమితులయ్యారు. అప్పటికే అస్తవ్యస్థంగా ఉన్న పాస్‌పోర్ట్‌ల జారీపై ఆయన దృష్టి సారించి తీవ్ర సంస్కరణలు చేపట్టారు. వేళ్లూనుకునిపోయిన దళారీ వ్యవస్థను పూర్తిగా తొలగించగలిగారు. ఆయన వచ్చేనాటికి పెండింగ్‌లో ఉన్న లక్ష పాస్‌పోర్ట్‌లను దశల వారీగా జారీ చేయగలిగారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుతోపాటు, ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోనే పాస్‌పోర్ట్‌ల జారీలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని అగ్రస్థానంలో నిలిపారు. ఇరాక్‌లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించడంలోనూ కీలక పాత్ర పోషించారు. తత్కాల్ పాస్‌పోర్ట్‌ను 24 గంటల్లోనే జారీ చేయగలిగారు. పాస్‌పోర్ట్‌ల జారీలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన శ్రీకర్‌రెడ్డి ప్రపంచ అత్యున్నత సంస్థ అయిన డబ్ల్యూటీఓకు బదిలీ అయ్యారు. ఆయన నెలాఖరున రిలీవ్ కావచ్చని సమాచారం. కొత్త పాస్‌పోర్ట్ అధికారిగా అశ్విని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా అశ్విని సత్తారు నియమితులయ్యారు. ఈమె 2007 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఇటీవలే పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి ఉమాపతి కూతురే అశ్విని. ఆమె గత కొన్ని నెలలుగా హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేస్తున్నారు. డాక్టర్ శ్రీకర్‌రెడ్డి బదిలీ కావడంతో ఆమెను ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా నియమిస్తూ విదేశీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. అశ్విని హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి తొలి మహిళా పాస్‌పోర్ట్ అధికారి కావడం విశేషం. ప్రాథమిక విద్య నుంచి ఇంజనీరింగ్ వరకూ అశ్విని హైదరాబాద్‌లోనే చదివారు. ఆమె రెండేళ్లపాటు పాస్‌పోర్ట్ అధికారిగా కొనసాగుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో పాస్‌పోర్ట్ కార్యాలయం, కొత్తగా మినీ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటు తదితర వాటిలో ఈమె కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.