ఆర్‌పీవో అశ్వినికి హైకోర్టు జరిమానా
కోర్టు ఆదేశాల అమలులో అలసత్వంపై మండిపాటు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించి నందుకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ (ఆర్‌పీవో) అధికారి అశ్విని సత్తారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ నిందితురాలి పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకో కుండా.. ఆమె దేశం విడిచి వెళ్లేందుకు కారణమైనందుకు రూ.15 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని పిటిషనర్‌కు చెల్లించాలని ఆమెను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కెయిత్ ఇటీవల తీర్పు వెలువరించారు. ఓ క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన పి.వెంకటరెడ్డి.. ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
అయితే పాస్‌పోర్ట్ అధికారులు తన వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు వెంకటరెడ్డి వినతిపత్రంపై రెండు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది ఆగస్టులో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిని ఆదేశించింది. కాని ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో వెంకటరెడ్డి.. కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సురేశ్ కెరుుత్.. ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అశ్విని వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఎదుట హాజరైన ఆమె.. కోర్టు ఉత్తర్వుల అమలులో అలసత్వానికి కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. దానిపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అందజేయడానికి పిటిషనర్ పదే పదే తిరిగినా పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు.