మూడో వంతు పునరుత్పాదక విద్యుత్తే! | Central Govt Announced Renewable Power Procurement And Storage Targets | Sakshi
Sakshi News home page

మూడో వంతు పునరుత్పాదక విద్యుత్తే!

Published Tue, Jul 26 2022 2:22 AM | Last Updated on Tue, Jul 26 2022 8:12 AM

Central Govt Announced Renewable Power Procurement And Storage Targets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోళ్లు (రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌/ఆర్పీఓ) విషయంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను విధించింది. కేంద్రం ప్రకటించిన లక్ష్యాల ప్రకారం 2022–23లో రాష్ట్రా ల విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేసే మొత్తం విద్యుత్‌లో ఏకంగా 24.61 శాతం తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్‌ ఉండాల్సిందే.

ఏటా క్రమంగా కొనుగోళ్ల శాతాన్ని పెంచుకుంటూ 2029–30 నాటికి 43.33 శాతానికి చేరాల్సి ఉంటుంది. 2022–23 నుంచి 2029–30 మధ్య తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాలను తాజాగా కేంద్ర విద్యుత్‌ శాఖ ప్రకటించింది. ఏటా ఎంత శాతం మేరకు పవన, జల, ఇత ర పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోళ్లు చేయాలో ఇందులో పొందుపర్చింది. ‘ఇతర పునరుత్పాదక వి ద్యుత్‌’ కేటగిరీలో సౌర విద్యుత్‌తోపాటు చిన్న, మధ్యతరహా జలవిద్యుత్‌ ప్రాజెక్టులు రానున్నాయి.

విద్యుత్‌ కోసం బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లపై అధిక శాతం ఆధారపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా కాలుష్యరహిత సౌర, పవన, జలవిద్యుత్‌ వంటి పునరుత్పాదక విద్యుత్‌ వినియోగాన్ని పెంచాలని ‘ప్యారిస్‌ ఒప్పందం’పేరుతో ప్రపంచ దేశాలు తీర్మానించాయి. ఈ క్రమంలోనే కేంద్రం రాష్ట్రాలకు భారీ ఆర్పీఓ లక్ష్యాలను నిర్దేశించింది. 

రాష్ట్రాల అభ్యంతరాలను కాదని..: నిర్దేశిత వార్షిక లక్ష్యాల మేరకు తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోళ్లు జరపాలని లేకుంటే కొనుగోళ్ల లో ఎంత లోటుంటే ఆ మేరకు జరిమానాలు చెల్లించాలనే నిబంధనను కేంద్రం అమలుచేస్తోంది. ఇప్పటికే ఉన్న ఆర్పీఓ లక్ష్యాలపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా తాజా గా కేంద్రం లక్ష్యాలను మరిన్ని పెంచింది. ఆర్పీఓ లక్ష్యాలకు తగ్గట్లు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి తెలంగాణలో సరిపడ స్థలాల్లేవని, లక్ష్యా లు పూర్తి చేయనందుకు జరిమానాలు విధిస్తే డిస్కంలు భారీగా నష్టపోవాల్సి వస్తుందని రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరం తెలియజేసింది.  

శ్రీశైలం, సాగర్‌ కరెంట్‌ లెక్కలోకి రాదు.. 
పాత జలవిద్యుత్‌ ప్రాజెక్టుల విద్యుత్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పునరుత్పాదక విద్యుత్‌గా పరిగణించబోమని కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. 25 మెగావాట్లు, ఆపై ఉత్పత్తి సామర్థ్యంగల, 2019 మార్చి 8 తర్వాత నిర్మితమైన భారీ జలవిద్యుత్‌ కేంద్రాలు, పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల విద్యుత్‌నే ఆర్పీఓ లక్ష్యాలుగా లెక్కిస్తామని పేర్కొంది. దీంతో ఏపీ, తెలంగాణ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వంటి జలవిద్యుత్‌ కేంద్రాల నుంచి ఏటా భారీగా విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న తెలుగు రాష్ట్రాల డిస్కంలకు ఈ నిబంధన తీవ్ర నష్టాన్ని కలిగించనుంది.

మరోవైపు 2022 మార్చి 31 తర్వాత పూర్తైన పవన విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి కొన్న విద్యుత్‌నే ఆర్పీఓ లక్ష్యం కింద లెక్కిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 100 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టుతో గతంలో ఒప్పందం చేసుకున్న తెలంగాణ డిస్కంలకు ఈ నిబంధనతో తీవ్ర నష్టమే జరగనుంది.  

ఇక విద్యుత్‌ నిల్వలు తప్పనిసరి: విద్యుత్‌ నిల్వలను కేంద్రం తప్పనిసరి చేసింది. రాష్ట్రానికి సరఫరా చేసే మొత్తం విద్యుత్‌లో 2022–23లో కనీసం ఒక శాతం నిల్వ చేసిన పవన, సౌర విద్యుత్‌లు ఉండాల్సిందే. 2029–30 నాటికి నిల్వ చేసిన సౌర, పవన విద్యుత్‌ వాడకం 4 శాతానికి పెరగాలి. బ్యాటరీలు లేదా పంప్డ్‌ స్టోరేజీ పద్ధతిలో నిల్వ చేసే విద్యుత్‌నే ఈ కేటగిరీ కింద లెక్కిస్తామని కేంద్రం తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement