సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, ఇతర సంస్థలు తమ మొత్తం వినియోగంలో కనీస వాటా మేర పునరుత్పాదక విద్యుత్(సౌర, పవన లాంటి)ను తప్పనిసరిగా వినియోగించాల్సిందే. లేని పక్షంలో జరిమానా తప్పదు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించిన వారికి ప్రోత్సాహకాలు సైతం లభించనున్నాయి. ఇంధన సంరక్షణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సవరణలు తీసుకురాబోతోంది.
విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుండటం, పర్యావరణ మార్పులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పునరుత్పాదక ఇంధన వినియోగ స్థాయిలను పెంచడానికి ఈ సవరణలు తీసుకువస్తున్నామని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. పరిశ్రమలు, భవనాలు, రవాణా తదితర రంగాల్లో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి ఈ సవరణలను ప్రతిపాదించింది. రంగాలవారీగా ఎంత శాతం మేర పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలన్న అంశాలను ఈ సవరణల ద్వారా కేంద్రం తెలపనుంది.
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేలా పునరుత్పాద విద్యుత్‌ను వినియోగించే సంస్థలకు ‘కార్బన్ సేవింగ్ సర్టిఫికెట్’రూపంలో ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే విద్యుత్ మంత్రిత్వశాఖ వివిధ వర్గాల వినియోగదారులతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించింది. ఈ సవరణలు అమల్లోకి వస్తే దేశంలో శిలాజాల(పెట్రో, డీజిల్ లాంటి) ఇంధన వనరుల వినియోగం తగ్గి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. గ్రిడ్ ద్వారా నిర్దేశిత పరిమాణంలో పునరుత్పాదక విద్యుత్ సరఫరా జరగనుంది.
కర్బణ ఉద్గారాల తగ్గింపే లక్ష్యం..
పారిస్ ఒడంబడిక ప్రకారం.. దేశంలో 2030 నాటికి కర్బణ ఉద్గారాల విడుదలను 33–35 శాతం మేరకు తగ్గించాలి. 2030 నాటికి మొత్తం ఇంధన అవసరాల్లో 40 శాతం అవసరాలను శిలాజయేతర ఇంధన వనరులను ద్వారా తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుని కేంద్రం ఈ సవరణలను తీసుకొస్తోంది. 2030 నాటికి కార్బన్ డయాక్సైడ్ విడుదలను 550 మెట్రిక్ టన్నులకు తగ్గించాలన్నది కేంద్రం లక్ష్యం. శిలాజాల ఇంధనవనరుల వినియోగం తగ్గించి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతిపాదిత సవరణలో ప్రత్యేక నిబంధనలు ఉండనున్నాయి.
చట్ట పరిధిలో భారీ నివాస భవనాలు..
వాతావణం కలుషితం చేయని విధంగా ఇంధన వనరులను వినియోగించే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేట్ రంగం సైతం భాగం కానుంది. భారీ నివాస భవనాలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని తప్పనిసరి చేయనుంది. భారీ భవనాలకు భవిష్యత్‌లో సోలార్ రూఫ్‌టాప్ లేదా ప్రత్యామ్నాయ మార్గంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగం తప్పనిసరి కానుంది.
Comments
Please login to add a commentAdd a comment