
వైఎస్సార్ సీపీ కన్నెర్ర
* గుంటూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
* తొలగించిన పింఛన్లు,రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్
* పేదల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓకు విన్నవించిన ఎమ్మెల్యే ముస్తాఫా, లేళ్ల ఆప్పిరెడ్డి
సాక్షి, గుంటూరు: అర్హుల ఫించన్లు, రేషన్ కార్డుల తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం ఉదయం గుంటూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ ఫించన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఆర్డీఓ భాస్కరనాయుడును కలిసి సమస్యను వివరించారు.
* పింఛన్లు కోల్పోయిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, రేషన్ కార్డులు లేని పేదల బాధలను చూడలేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. పేదలకు అండగా నిలిచేందుకు గుంటూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు నడుం బిగించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరాగా, ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న పేదల బాధలను ఆలకించారు.
* శివపార్వతి అనే పేద మహిళ మాట్లాడుతూ ‘ నాకు ఉండటానికి ఇల్లు లేదు...దాసరిపాలెంలో ఓ పూరిపాకలో అద్దెకు ఉంటున్నా...ఆధార్ కార్డు లేదని రేషన్ బియ్యం ఇవ్వడం లేదు..’అని కంట తడిపెట్టుకుంది.
* ఇలా ఒక్కొక్కరు తమ బాధలను తెలియజేయడంతో పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ తొలగించిన రేషన్‌కార్డులు పునరుద్ధరించాలని, పేదలందరికి బియ్యం ఇవ్వాలని, అర్హులైనవారి ఫించన్లు తిరిగి ఇవ్వాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ భాస్కరనాయుడును కలసి సమస్య తీవ్రతను ఆయనకు వివరించారు.
* ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ ‘నిన్నటి వరకు వచ్చే పింఛన్ ఇప్పుడు ఆగిపోయింది. రేషన్ బియ్యం రావటం లేదు.పేదలు కూలి పనులు మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదెంత దారుణం’ అని ఆర్డీఓను నిలదీశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వరు, సమస్యలు పరిష్కారం కావు, మరెందుకు జన్మభూమి నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
* అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఉన్న కార్డులు, పింఛన్లు తీసివేస్తే ఎలా అని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా 1.81 లక్షల రేషన్ కార్డులు, 9.88 లక్షల వ్యక్తిగత యూనిట్లలకు రేషన్ నిలిపివేశారు. గుంటూరు నగరానికి సంబంధించి దాదాపు 36 వేల రేషన్ కార్డులు, లక్ష వ్యక్తిగత యూనిట్లకు రేషన్ రావటం లేదు. లక్ష మంది ఇక్కడికి వచ్చి ఆధార్ అనుసంధానం చేయించుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో అర్థం చేసుకోవాలన్నారు. జిల్లాలో 53 వేలకుపైగా పింఛన్లు తీసివేశారని ఆయన ధ్వజమెత్తారు.
* అనంతరం ఆర్డీఓ భాస్కర నాయుడు మాట్లాడుతూ జన్మభూమి జరిగే సమయంలో డివిజన్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు తీసుకోవడం తో పాటు, ఆధార్ అనుసంధానం వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
* కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్రమైనార్టి సెల్ కార్యదర్శి చాంద్‌బాషా, రాష్ట్ర మహిళ కమిటీ సభ్యురాలు మేరుగ విజయలక్ష్మి, నగర మైనార్టి సెల్ అధ్యక్షులు షేక్‌బాబు, నాయకులు చిన్నపరెడ్డి, మద్దుల రాజాయాదవ్ తదితరులు పాల్గొన్నారు