సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది..! | Guntur roads and drainage system there are worse | Sakshi
Sakshi News home page

సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది..!

Published Wed, Jul 15 2015 1:22 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

Guntur roads and drainage system there are worse

 సాక్షి, గుంటూరు : రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరులో రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ అధ్వానంగా ఉన్నాయి. అయినా వాటిపై దృష్టి పెట్టని గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు తమకు సంబంధం లేని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రూ. 90 లక్షల వ్యయంతో లుంబినీ పార్కు నిర్మాణానికి ఐదు నెలల క్రితం టెండర్‌లు పిలిచి పనులు అప్పగించారు. ఫుట్‌పాత్ నిర్మాణానికి రూ.5 లక్షలు, కలెక్టర్ కార్యాలయ మెయిన్ గేట్ నిర్మాణానికి రూ.10 లక్షలు నగరపాలక సంస్థ అధికారులు నిధులు విడుదల చేశారు.

మామూలుగా అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్మాణ పనులు చేపట్టాలంటే ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్‌లు పిలిచి పనులు కేటాయించాలి. నగరపాలక సంస్థ నగర అభివృద్ధికి  తప్ప మరే ఇతర కార్యాలయాలకు, అధికారుల ఇళ్లల్లో నిర్మాణాలు, మరమ్మతులు నిర్వహించకూడదు. అయితే నగరపాలక సంస్థ అధికారులకు ఈ నిబంధనలేమీ పట్టలేదు. ఈ వ్యవహారమంతా ఇన్‌చార్జి కమిషనర్ పాలనలో నడిచిన వ్యవహారంగా నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు.

 సొంత కార్యాలయానికి దిక్కులేదు..
 చినుకు పడిందంటే చాలు నగరపాలక సంస్థ కార్యాలయం మురుగునీటితో నిండి తటాకాన్ని తలపిస్తుంది. అయినా ఇదేమీ అక్కడి అధికారులకు పట్టడం లేదు. తమ సొంత కార్యాలయాన్ని పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు సంబంధంలేని కలెక్టర్ కార్యాలయంలో పార్కుల నిర్మాణానికి నిధులు కేటాయించటంపై నగర ప్రజలు మండిపడుతున్నారు.  నగర ఇన్‌చార్జి కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఓ ఉన్నతాధికారి తన క్యాంపు కార్యాలయానికి రూ.85వేల కార్పొరేషన్ నిధులతో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా క్యాంపు కార్యాలయంలో మరమ్మతులు సైతం నిర్వహించినట్లు సమాచారం.

జిల్లాకు చెందిన మరో అత్యున్నతస్థాయి అధికారి క్యాంపు కార్యాలయంలో గదుల మరమ్మతుల పేరుతో రూ. 3 లక్షల కార్పొరేషన్ నిధులను ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి ఆయా కార్యాలయాల్లో ఏవైనా అభివృద్ధి పనులు ఆర్‌అండ్‌బి అధికారులు చేయాల్సి ఉంది. అయితే ఈ పనులను నగరపాలక సంస్థ నిధులతో చేయటం పలు విమర్శలకు తావిస్తోంది. గతంలో ఇదే తరహాలో అప్పటి ఎస్పీ లడ్హా క్యాంపు కార్యాలయంలో లక్షల వ్యయంతో మరమ్మతులు చేయించారు. అప్పట్లో నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్‌లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తమ నిధులను వెనక్కు ఇవ్వాలంటూ అప్పటి కమిషనర్ ఆర్‌అండ్‌బీ అధికారులకు లేఖ కూడా రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement