బాబోయ్‌ కోడెల...మాకొద్దు!  | Guntur TDP Leaders Avoid Kodela Family | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ కోడెల...మాకొద్దు! 

Published Mon, Jul 1 2019 8:50 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

Guntur TDP Leaders Avoid Kodela Family - Sakshi

సాక్షి, గుంటూరు : బాబోయ్‌ కోడెల కుటుంబం.. ఎవరిని కదిలించినా.. ఎవరిని పలకరించినా ఇదే మాట.. అధికారంలో ఉండగా అవినీతే పరమావధిగా చెలరేగిన కోడెల కుమారుడు, కుమార్తె పేరు చెబితే చాలు.. తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి బడా కాంట్రాక్టర్ల వరకు కన్నీటి పర్యంతమవుతున్నారు. వారి దోపిడీని అడ్డుకునే శక్తి లేక అడిగినంత ఇచ్చుకున్నారు. అధికారం మారాక వారంతా తిరగబడి కేసులు పెడుతున్నారు. మరో వైపు కోడెల కుటుంబం వెంట తాము ఉండబోమంటూ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వేరు కుంపటి పెడుతున్నారు.

ఇటు నరసరావుపేట, అటు సత్తెనపల్లిలో కోడెల పేరు చెబితేనే సొంత పార్టీ నాయకులతోపాటు ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తోపుడు బండి నిర్వాహకుడి నుంచి బడా కాంట్రాక్టర్‌ వరకూ ప్రతి ఒక్కరి వద్ద కే ట్యాక్స్‌ పేరుతో అడ్డగోలుగా డబ్బు వసూలు చేశారు. దోచుకోవడంలో తన, మన అన్న తేడాలు చూడలేదు. దీంతో అణచివేతకు గురైన వారందరూ నేడు తిరగబడుతున్నారు. పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కి కేసులు పెడుతున్నారు. ఫలితంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో శాసన సభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం పరిస్థితి దారుణంగా తయారైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. సొంత పార్టీ నుంచి ఎవ్వరు అండగా నిలవని దుస్థితి. తాజాగా సొంత పార్టీ నేతలు కొందరు కోడెలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. 

సార్వత్రిక ఎన్నికల్లోనే..
సార్వత్రిక ఎన్నికల్లోనే కోడెల శివప్రసాద్‌రావుకు వ్యతిరేకంగా ఆ పార్టీ అసమ్మతి నేతలు తిరుగుబాటు చేశారు. కుక్కకైనా మద్దతిస్తాం కాని కోడెలకు మాత్రం ఇవ్వబోమని రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయితే ఆ సమయంలో పార్టీ పెద్దలు కలుగజేసుకుని క్యాడర్‌కు సర్దిచెప్పి కోడెల శివప్రసాదరావును బరిలో నిలిపారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో కోడెల సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. కోడెల ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆ కుటుంబం నుంచి వేధింపులకు గురైన వారందరూ ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్న వారిలో టీడీపీకి చెందిన వారు కూడా ఉండటంతో ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. 

దూరమవుతున్న కేడర్‌..
తాజాగా నరసరావుపేట, సత్తెనపల్లిలో నియోజకవర్గాల్లో కోడెల వద్దకు ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. సత్తెనపల్లిలో అయితే ఏకంగా కోడెల అసమ్మతి నేతలు పాత టీడీపీ నియోజకవర్గ కార్యాలయం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. సత్తెనపల్లి పాత బస్టాండ్‌ సెంటర్‌లో టీడీపీ నియోజకవర్గ కార్యాలయం చాలా ఏళ్ల కిందట నిర్మించారు. అయితే అది వాస్తు ప్రకారం బాగోలేదని 2014 ఎన్నికలకు ముందు నాగార్జున నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో పార్టీ కార్యకలాపాలు కోడెల నిర్వహించారు.

ఆ ఎన్నికల అనంతరం రఘురామ్‌ నగర్‌లోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి పార్టీ కార్యకలాపాలు కొనసాగించారు. అయితే తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని కోడెల అసమ్మతి వర్గ టీడీపీ నాయకులు పాత బస్టాండ్‌ సెంటర్‌లోని పాత టీడీపీ కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రఘురామ్‌ నగర్‌లో కోడెల నిర్వహించి పార్టీ నాయకుల సమావేశానికి కూడా వీళ్లేవ్వరు వెళ్లలేదు. నరసరావుపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆది నుంచి కోడెల అనుచరులుగా ఉన్న చాలా మంది ప్రస్తుతం ఆయన నాయకత్వాన్ని వద్దనుకుంటున్నారు. కనీసం ఆయన నివాసం వైపు కూడా చాలా మంది నాయకులు తొంగి చూడటం లేదని తెలుస్తోంది. 

పెద్దలకు ఫిర్యాదులు..
అధికారం అండతో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో సొంత పార్టీ వారిని సైతం కోడెల కుటుంబం పీక్కుతిందని బాధితులు టీడీపీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం. ఇటీవల నిర్వహించిన టీడీపీ జిల్లా ముఖ్యనాయకుల సమావేశంలో సైతం కోడెలపై పలువురు నేతలు ఫిర్యాదు చేశారని, ఆ కుటుంబం ఆగడాల వల్లే ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఘోర పరాజయం పాలైందని నాయకులు మండిపడ్డారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కోడెల చేసిన పాపాలే పండాయని, అధికారం అండతో విర్రవీగే నాయకులందరికీ కోడెల శివప్రసాద్‌ ఎదుర్కొంటున్న పరాభవం ఓ ఉదాహరణగా ఉండిపోతుందని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement