గుంటూరు, విశాఖ జిల్లాలకు మన బియ్యం
విజయనగరం: జిల్లాలోని బియ్యాన్ని గుంటూరు, విశాఖ జిల్లాలకు తరలించేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జిల్లాలో 2.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇంకా సేకరిస్తున్నారు. అయితే వీటిని మిల్లర్లు మరపట్టి ఆడించి ఇస్తే 2లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం వస్తాయి. జిల్లాలో మాత్రం కేవలం 96,983 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని 118 మిల్లుల ద్వారా లక్ష మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం వచ్చి చేరాయి. సామర్థ్యం సరిపోక పోవడంతో గోదాములకు చేరిన లారీలు అన్‌లోడింగ్‌కు అవకాశం లేకపోవడంతో రోడ్లపైనే నిలిచిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ను సంప్రదించిన జిల్లా అధికారులు పదివేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విశాఖలోని పెందుర్తి గోదాముకు తరలించి ఆమేరకు మాత్రమే ఖాళీ చేయించగలిగారు. ప్రతి రోజూ బియ్యం నిల్వలు పది నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల వరకూ వస్తూనే ఉన్నాయి. వర్షం వస్తే బియ్యం పాడయి భారీ నష్టం ఏర్పడే ప్రమాదమున్నందున మార్కెటింగ్, వేర్ హౌస్, సివిల్‌సప్లైస్ అధికారులతో జాయింట్‌కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం ధాన్యం ఉత్పత్తులు తక్కువగా ఉన్న గుంటూరు, చిత్తూరు జిల్లాలకు సుమారు 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విజయనగరం నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా శుక్రవారం నుంచి తరలించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ప్రజాపంపిణీ, వసతిగృహాలు, మధ్యాహ్న భో జనం వంటి అవసరాలకు ప్రతినెలా దాదాపు 12వేల మెట్రిక్ టన్నులు ఖాళీ అవు తాయి కనుక సమస్య తీరుతుందని భావిస్తున్నారు.