విజయనగరం కల్చరల్: మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళు లర్పించారు. గురజాడ స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడుతూ గురజాడ స్వగృహంలో ఆయన వర్థంతిని నిర్వహించడం ఆనందదాయకమన్నారు.వచ్చే ఏడాది గురజాడ 100వ వర్థంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు కృషిచేస్తానని వెల్లడించారు. గురజాడ జయంతి, వర్ధంతులను జరపడం ఆ మహనీయునికి మనమిచ్చే గౌరవమన్నారు.
కలెక్టర్ ప్రసంగానికి ముందు గురజాడ సాంస్కృతిక సమాఖ అధ్యక్షుడు పి.వి.నరసింహరాజు,ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్,కోశాధికారి ఎ.గోపాలరావు,మేకాకాశీవిశ్వేశ్వరుడు గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆ సమయంలో వర లక్ష్మీ త్యాగరాజ సంగీత కళాశాల విద్యార్థులు ‘ఎంత గొప్పవాడవయ్యా గురజాడ’అన్న గీతాన్ని ఆలపించారు.పూలమాలాలంకరణ అనంతరం గురజాడ రాసిన దేశభక్తి గీతాలు పాడుతూ గురజాడ వాడిన వస్తువులతో ఊరేగింపుగా బయలుదేరారు. ఈ ఊరేగింపు గురజాడ గృహంనుంచి బయలుదేరి మూడులాంతర్లు,గంటస్తంభం మీదుగా మహారాజా కళాశాల వద్ద ఉన్న గురజాడ విగ్రహం వద్దకు చేరింది. అక్కడ గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మధురవచస్వి మానాప్రగడ శేషశాయి మాట్లాడుతూ ఆనాటి సమస్యలను తన రచనల ద్వారా తెలియచెప్పిన మహాకవి గురజాడ అని కొనియాడారు.
సమాఖ్య ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న అన్ని సాహిత్యసంస్థలు కలిసి గురజాడ సమాఖ్య పేరిట ఏటా గురజాడ జయంతి,వర్ధంతులను నిర్వహిస్తున్నాయన్నారు. గురజాడ వర్ధంతి రోజున సాహిత్యంలో నిష్ణాతులైన వారిని సన్మానిస్తున్నామని చెప్పారు. అనంతరం గురజాడ స్మారక జిల్లా కేంద్రగ్రంథాలయంలో ‘గురజాడ సాహితీ సదస్సు’ను నిర్వహించారు. ఈసదస్సులో వక్తలుగా కాకినాడకు చెందిన సహృదయ సాహితీ అధ్యక్షుడు వేదుల శ్రీరామశర్మ, శ్రీకాకుళం గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు పాల్గొని ‘భాషా సంఘ సంస్కర్త గురజాడ,’‘కవితల్లో గురజాడ’అనే విషయాలపై ప్రసంగించారు. మానాపురం రాజాచంద్రశేఖర్,పి.లక్ష్మణరావు గురజాడపై కవితలను చదివి వినిపించారు. కార్యక్రమంలో ప్రముఖ నటుడు,రచయిత ఎ.బి.సుబ్బారావు,సిహెచ్. నరసింహమూర్తి గురజాడ మునిమనుమడు ప్రసాద్ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘మహా’ నివాళి
Published Mon, Dec 1 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement
Advertisement