ఏలూరు సిటీ : సర్కారు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై జిల్లా విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ‘గురు సేవా దర్బార్’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేసవి సెలవులు ముగిసే వరకు ప్రతి బుధవారం, ఆ తరువాత ప్రతినెలా రెండో బుధవారం రోజున ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై డీఈవో కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తారు. వాటిని సత్వరమే పరిష్కరి స్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఈవో డి.మధుసూదనరావు ఇలా వివరించారు.
= గురు సేవా దర్బార్ దేనికోసం ..
డీఈవో : ఉపాధ్యాయులు అనేక రకాల సేవల కోసం నిత్యం మా కార్యాలయానికి వస్తుంటారు. సిబ్బంది కొరత కారణంగా వారి పనులను సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. రోజూ వచ్చి తిరిగి వెళ్లేకంటే నిర్దేశిత సమయంలో పూర్తిస్థాయిలో సేవలు అందించాలనే లక్ష్యంతో గురు సేవా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
= ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు
డీఈవో : వేసవి సెలవులు ముగిసే వరకు ప్రతి బుధవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గురుసేవా దర్బార్ నిర్వహించి ఆర్జీలను స్వీకరిస్తాం. విద్యాశాఖ పరిధిలో ఉండే అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం. దీర్ఘకాలిక సమస్యలను సైతం వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల అనంతరం పరి ష్కరించి తగిన ఉత్తర్వులు ఇస్తాం.
= నిబంధనలు, మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా
డీఈవో : ఉపాధ్యాయులు నేరుగా, స్వేచ్ఛగా తమ సమస్యల్ని పరిష్కరించుకునే వేదికగా దీనిని తీర్చిదిద్దుతున్నాం. ఒక ఉపాధ్యాయుడు ఒక ఆర్జీ మాత్రమే స్వయంగా తీసుకురావాలి. ఉపాధ్యాయ సంఘాల ద్వారా ఆర్జీలు తీసుకువస్తే స్వీకరించేది లేదు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కొత్త కేసులు తగ్గటంతోపాటు, ఉపాధ్యాయుల సమస్యలన్నీ సకాలంలో పరిష్కారం అవుతాయి.
= జిల్లాలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు
డీఈవో : ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 15వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారు 8వేల మంది ఉన్నారు. వీరితోపాటు కార్యాలయాల్లో పనిచేసే బోధనేతర సిబ్బందికి సైతం జిల్లా విద్యాశాఖ కార్యాలయ సేవలు అందించాల్సి ఉంది.
= ఏ ఏ సేవలు అందిస్తుంటారు
డీఈవో : ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి సంబంధించి సుమారు 40 రకాల సేవలను అందిస్తున్నాం. సర్వీసు క్రమబద్దీకరణ, వృత్తి ధ్రువీకరణ, ఇంక్రిమెంట్ల మంజూరు, పాస్‌పోర్టుల కోసం ఎన్‌వోసీ, విదేశీ పర్యటనకు అనుమతులు, ప్రావిడెంట్ ఫండ్ మంజూరు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు, ప్రతిభా పురస్కారాలు, ప్రజావాణి కేసులు, సస్పెన్షన్ల ఎత్తివేత, పదోన్నతులు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు, ఎఫ్‌ఏసీ అలవెన్సులు వంటి సేవలు అందిస్తాం.
ఇకనుంచి గురు సేవా దర్బార్
Published Fri, May 29 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement
Advertisement