
సాక్షి, అమరావతి: రాజకీయంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం ఉంటుందని ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని 50 శాతం మంది ప్రజలు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని.. అలాంటి ప్రభుత్వ అధికారంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.
అదే విధంగా.. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని.. రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చని జీవీఎల్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకుంటోందని కొందరు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని తాము స్పష్టంగా చెబుతున్నామన్నారు.(రాజధాని అంశంపై తొలిసారిగా స్పందించిన కేంద్రం)
కాగా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశంపై కేంద్రం మంగళవారం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని.. ఈ విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.(రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’)
Comments
Please login to add a commentAdd a comment