సాక్షి, న్యూఢిల్లీ : తమ ప్రభుత్వంలో ఉన్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. తాను పదవిలో ఉన్నప్పుడు సాధించిన అంశాల గురించి వివరిస్తూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ రాసిన లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెంప పెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. 2016-17 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 9700 కోట్ల రూపాయలు మంజూరు చేసిన కేంద్రం.. 2017-18లో 17, 500 కోట్ల రూపాయలు విడుదల చేసిందని జీవిఎల్ తెలిపారు. అదే విధంగా ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో 10, 372 కోట్ల రూపాయల నిధులు కేటాయించారన్నారు. ఇవన్నీ బీజేపీతో టీడీపీ నుంచి విడిపోయాక విడుదలైన నిధులేనని.. అయినప్పటికీ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందంటూ అసత్య ప్రచారం చేస్తూ టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా అలా వ్యవహరించినట్లైతే రాష్ట్రానికి ఇన్ని నిధులు వచ్చేవా అని జీవీఎల్ ప్రశ్నించారు.
రాద్దాంతం చేయకండి
కేంద్ర నిధుల విడుదలపై వివరాలు కోరుతూ చంద్రబాబుకు లేఖ రాశానన్న జీవీఎల్ వెనుకబడిన జిల్లాల విషయంలో 350 కోట్ల రూపాయలపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. యూసీలు ఇచ్చామని చెప్తున్నారు... వాటితో పాటు యుటిలైజేషన్ ఎక్స్ పెండిచర్ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలా చేయకుండా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.
ఓ డప్పు కొట్టుకుంటున్నారు
చంద్రబాబు నాయుడికి గ్లోబల్ అగ్రికల్చర్ పాలసీ లీడర్ షిప్ అవార్డు వచ్చిందని టీడీపీ నాయకులు డప్పు కొట్టుకుంటున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. అదేదో ప్రపంచంలో ఈయనకి ఒక్కడికే వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికే కేసీఆర్ సహా చాలా మంది ముఖ్యమంత్రులకు ఈ అవార్డు వచ్చిందని.. అయితే ప్రపంచంలో ఎవరికీ ఈ అవార్డు రాలేదన్నట్టుగా ఊదరగొడతారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment