డయ్యూ స్మార్ట్ సిటీ
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని 100 స్మార్ట్ సిటీ ల జాబితాలో టాప్–10లో నిలిచిన మహా విశాఖ నగరం.. మరో స్మార్ట్ సిటీ అభివృద్ధికి చేయూతనందించనుంది. కేంద్ర పట్టణాబివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనల మేరకు కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూను సిస్టర్ సిటీగా దత్తత తీసుకుంది. ఈ నగరంలో రూ.1000 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. వాటికి సంబంధించి సలహాలందించేందుకు జీవీఎంసీ సమాయత్తమవుతోంది. నగరాల్ని ఆర్థిక, సామాజిక, పర్యావరణ హిత సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. దేశంలో 5 విడతల్లో 100 నగరాల్ని ఎంపిక చేసి వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తోంది.
తొలి జాబితాలోనే ఎంపికైన విశాఖ నగరం.. స్మార్ట్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. స్మార్ట్ ప్రాజెక్టుల అమల్లో విశాఖ నగరం ఆది నుంచి మంచి స్థానంలోనే కొనసాగుతూ కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతున్న విశాఖ నగరం.. ఇటీవలే బెస్ట్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు అవార్డును సైతం సొంతం చేసుకుంది. టాప్–20లో దూసుకుపోతున్న నగరాల మాదిరిగానే.. అట్టడుగున ఉన్న నగరాలను అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది.
ట్వంటీ 20 ఫార్ములా..
దిగువ స్థాయిలో ఉన్న నగరాలు సైతం.. అత్యుత్తమ సిటీలుగా గుర్తింపు పొందేలా ప్రోత్సహించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ట్వంటీ ట్వంటీ ఫార్ములాను అమలు చేస్తోంది. టాప్–20లో ఉన్న నగరాలతో.. దిగువ స్థాయిలో ఉన్న 20 నగరాలను అనుసంధానించిది. ఇందులో భాగంగా విశాఖ నగరానికి సిస్టర్ సిటీగా కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ స్మార్ట్ సిటీని అనుసంధానించారు. ప్రస్తుతం డయ్యూ నగరం 80వ స్థానంలో ఉంది. ఈ నగర బాధ్యతను విశాఖ స్మార్ట్ సిటీ చేపట్టనుంది. సిస్టర్ సిటీల్లో భాగంగా.. ట్వంటీ 20 ఫార్ములా ప్రకారం ఏఏ బాధ్యతలను చేపట్టాలనే విషయాలపై ఈ నెలాఖరున రెండు నగరాలూ ఒప్పందం కుదర్చుకోనున్నాయి.
రూ.498 కోట్ల ప్రాజెక్టులకు సలహాలు..
గుజరాత్ దక్షిణ ప్రాంత తీరంలోని అరేబియా సముద్ర తీరంలో 40 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న డయ్యూ నగరంలో 12.14 కిలో మీటర్ల మేర స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.498.41 కోట్ల నిధులతో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నీటి సరఫరా, స్మార్ట్ మొబిలిటీ, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి వ్యవస్థ, సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు, స్మార్ట్ స్కూల్స్ నిర్వహణ మొదలైన అంశాలపై డయ్యూ స్మార్ట్ సిటీకి విశాఖ నగరం సలహాలు అందించనుంది.
నిధుల వినియోగంలో డయ్యూ వెనుకంజ..
డయ్యూ నగరాన్ని సిస్టర్ సిటీగా ఎంపిక చేశారు. నిధుల వినియోగంలో డయ్యూ స్మార్ట్ సిటీ వెనుకంజలో ఉంది. ప్రాజెక్టు ప్రణాళికలు, వాటిని ఆచరణలోకి తీసుకు రావడం మొదలైన అంశాల్లో సలహాలు ఇవ్వనున్నాం. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఒప్పందం జరిగిన వెంటనే.. ఇంజినీర్లను పంపించి.. టెండర్లను ఎలా రూపొందించాలి.. మొదలైన అంశాలపై సలహాలు, సూచనలు అందించి.. బెస్ట్ స్మార్ట్ సిటీగా డయ్యూను అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment