గాజువాక ఎమ్మెల్యేకు పరాభవం | GVMC Officials Stops Mla Palla Srinivasa Rao in Visakhapatnam | Sakshi
Sakshi News home page

గాజువాక ఎమ్మెల్యేకు పరాభవం

Published Tue, Dec 25 2018 1:00 PM | Last Updated on Tue, Dec 25 2018 1:00 PM

GVMC Officials Stops Mla Palla Srinivasa Rao in Visakhapatnam - Sakshi

సినీనటుడు భానుచందర్‌ను సన్మానిస్తున్న రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పెనుమత్స శ్రీనివాస్‌రాజు

విశాఖపట్నం, గాజువాక: టీడీపీ ప్రదర్శించిన విగ్రహ రాజకీయానికి జీవీఎంసీ అధికారులు చెక్‌ చెప్పారు. టీడీపీ నాయకుడు పులి వెంకట రమణారెడ్డి తండ్రి, ఉక్కు నిర్వాసిత నాయకుడు భూలోకరెడ్డి విగ్రహాన్ని పెదగంట్యాడలో ఏర్పాటు చేస్తున్న సమయంలో జీవీఎంసీ అధికారులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి స్వయంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వచ్చి అధికారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. తాను లేఖ ఇస్తానని, విగ్రహ ఏర్పాటుకు అనుమతించాలని ఎమ్మెల్యే కోరినా ‘ఆ విషయం ఉన్నతాధికారులతో మాట్లాడుకోండ’ని చెప్పడంతో చేసేదిలేక వెనుదిరిగారు. పెదగంట్యాడ జంక్షన్‌ బీసీ రోడ్డులో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గాజువాక మున్సిపాలిటీ పాలకవర్గం నిర్ణయించి శంకుస్థాపన కూడా చేసింది. విగ్రహ ఏర్పాటు జాప్యం కావడంతో అదే స్థలంలో భూలోకరెడ్డి విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు పదేళ్ల క్రితం రాత్రికి రాత్రే పెట్టేశారు. దీనిపై దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో ఆ విగ్రహానికి అధికారులు ముసుగు వేసేశారు. విగ్రహాన్ని అక్కడ్నుంచి తొలగించాలని, అంబేడ్కర్‌ విగ్రహమే ఉండాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టలేకపోయారు.

ఇదిలా ఉంటే కొంతమంది దుండగులు పెదగంట్యాడ ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి చెవులు, ముక్కు తొలగించి ఇటీవల ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆందోళనకు దిగిన దళితులకు అన్ని వర్గాలు, రాజకీయ పార్టీల నుంచి సంఘీభావం లభించింది. అయితే ఆ సానుభూతిని తనవైపు తిప్పుకోవాలని ఎమ్మెల్యే భావించి, ఆందోళన విరమిస్తే న్యాయం చేస్తానని చెప్పారు. భూలోకరెడ్డి విగ్రహాన్ని తొలగించి అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆందోళన విరమిస్తామని వారు తెగేసి చెప్పారు. దీంతో పులి వెంకట రమణారెడ్డితో చర్చించిన ఎమ్మెల్యే.. భూలోకరెడ్డి విగ్రహాన్ని అక్కడ్నుంచి తొలగించి, నిర్వాసిత భవనం వద్ద ఏర్పాటు చేసుకొనేందుకు ఒప్పించారు. దగ్గరుండి ఆ విగ్రహాన్ని తొలగించి నిర్వాసిత భవనం వద్దకు తరలించారు. దాన్ని సోమవారం ఏర్పాటు చేస్తుండగా అక్కడికి చేరుకున్న జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ శ్రీదేవి అడ్డుకున్నారు. కొత్తగా విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే పల్లా అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ ఏసీపీ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎంత ప్రయత్నించినా అధికారులు ససేమిరా అనడంతో చేసేది లేక ఎమ్మెల్యే వెనుదిరిగారు. అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినా చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది.

భూలోకరెడ్డి విగ్రహాన్ని మూడ్రోజుల క్రితం తొలగించారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్యే మాట మార్చారని దళితవర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసిన తరువాతే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆయన చెబుతున్నట్టు పేర్కొంటున్నారు. ఈ ఉదంతంతో అటు టీడీపీ శ్రేణుల్లోను, ఇటు దళితవర్గాల్లోను ఎమ్మెల్యే పరువు పోగొట్టుకున్నారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement