
అర్ధ సంవత్సరంలోనూ అదే గందరగోళం
నెల్లూరు(అర్బన్): ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సమ్మేటివ్-2(అర్ధ సంవత్సర) పరీక్షల వ్యవహారం గందరగోళంగా మారింది. సమ్మేటివ్-1 పరీక్షలప్పుడు ఉపాధ్యాయులే ప్రశ్నాపత్రాలు ముద్రించుకోవాలని, ఒక్కో విద్యార్థికి అన్నీ సబ్జెక్టులకు కలిపి కేవలం రూ.2.50 మాత్రమే కేటాయించి విమర్శలపాలైన అధికారులు తాజాగా పాత పద్ధతినే కొనసాగించాలని ఆదేశించి ఉపాధ్యాయులపై పెనుభారం మోపారు. అలాగే 9, 10 తరగతులకు చెందిన ఒక్కో విద్యార్థి నుంచి పరీక్షల కోసం రూ.15 వసూలు చేయాలని ఆదేశాలిచ్చారు. విద్యార్థుల నుంచి ప్రశ్నాపత్రాల కోసం డబ్బులు వసూలు చేయకూడదని భావించిన విద్యాశాఖ ఇప్పుడు వసూలు చేసుకోమని మౌఖికంగా ఆదేశాలు ఇవ్వడం విమర్శలకు తావిచ్చినట్లయింది.
గత ఏడాది ఇచ్చిన ఎస్‌ఎస్‌ఏ
సాధారణంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థుల సమ్మేటివ్ పరీక్షలకు ఎస్‌ఎస్‌ఏ (సర్వ శిక్షా అభియాన్), 9, 10 తరగతులకు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డులు ప్రశ్నాపత్రాలను సరఫరా చేసేవి. అయితే ఈ ఏడాది సమ్మేటివ్-1 పరీక్షలకు మాత్రం స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో సమావేశాలు పెట్టుకొని ఉపాధ్యాయులనే ముద్రించుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.
ఇందుకు కేవలం ఒక్కో విద్యార్థికి రూ.2.50 మాత్రమే కేటాయించింది. అన్నీ సబ్జెక్టులకు పేపర్ల రూపంలో ఒకటి, రెండు తరగతులకు 12 పేపర్లు 3, 4, 5 తరగతులకు- 16 పేపర్లు 6, 7 తరగతులకు 44, 8వ తరగతికి 52 పేపర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల రూ.2.50 సరిపోవని, స్కూల్ గ్రాంట్ నుంచి తగినన్ని నిధులు కేటాయించాలని అటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దీనిపై ఉన్నతాధికారులు దీనిని లెక్క చేయకుండానే పరీక్షలు జరిపించారు.
సమ్మేటివ్-2 అంతే
ఈనెల 15వ తేదీ నుంచి సమ్మేటివ్-2 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ప్రశ్నాపత్రాల విషయంలో అధికారులు పాత పద్ధతినే కొనసాగించాలని ఆదేశించారు. దీంతో జిల్లాలో గురు, శుక్రవారాల్లో సమావేశాలు జరిగాయి. సమ్మేటివ్-1 సమయంలో చేసినట్లుగానే ఈసారి ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులు పెట్టుకొని విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు రూ.500 నుంచి వెయ్యి వరకు భారం పడుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర ఎస్‌ఎస్‌ఏ ప్రశ్నాపత్రాలు ఇచ్చే సమయంలోనే కొన్నిచోట్ల సరిపోయేవి కావు. ఇప్పుడు ఉపాధ్యాయులను ముద్రించి ఇవ్వమని చెబితే కొన్ని పాఠశాలల్లో రెండు, మూడు ప్రశ్నాపత్రాలు విద్యార్థులకు ఇచ్చి సర్దుకోమని చెప్పే అవకాశం లేకపోలేదు. ప్రశ్నాపత్రాల కోసం స్కూల్ గ్రాంట్స్ లేదా నిర్వహణ గ్రాంట్ నుంచి నిధులు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎస్‌ఎస్‌ఏ అధికారులు ఈ విషయంలో ఉన్నతాధికారుల ఉత్తర్వులు పాటించడం తప్ప తాము ఏమీ చేయలేమని వాపోతున్నారు.
సమయం తక్కువ
పరీక్షలు ప్రాంభమయ్యేందుకు సమయం చాలా తక్కువగా ఉంది. గురు, శుక్రవారాల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరిగాయి. శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం పరీక్షల నాటికి ఉపాధ్యాయులు ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసేది అనుమానంగానే ఉంది. కొంతమంది ప్రధానోపాధ్యాయులు మాట్లాడుకొని ప్రైవేటు ప్రింటర్స్ వద్ద ప్రశ్నాపత్రాలను ముద్రించి విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం విద్యార్థుల నుంచి కొంతమొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు ఇచ్చే కామన్ ఎగ్జామినేషన్ బోర్డును సెప్టెంబర్‌లో రద్దుచేశారు. దీంతో ప్రశ్నాపత్రాల కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వసూలు చేయాలని ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు సుమారు 72వేల మంది ఉన్నారు.
అదే అదనుగా కొందరు హెచ్‌ఎంలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే అవకాశం లేదు. పరీక్షలకు సమయం తక్కువగా ఉన్న సమయంలో విద్యాశాఖ ఇలా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం తగదని ఉపాధ్యాయ సంఘ నేతల అంటున్నారు.