
సీఆర్‌ఆర్ కాలేజీ వద్ద రోడ్డుపై రాస్తారోకో చేస్తోన్న విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు
ఏలూరు టౌన్ : బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో సీఆర్‌ఆర్ కళాశాల యాజమాన్యం వివిధ కారణాలతో విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు మంజూరు చేసేందుకు నిరాకరించటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాల్‌టిక్కెట్లు ఏ కారణాలతోనైనా ఆపితే కఠిన చర్యలు తప్పవని ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు హెచ్చరించినా యాజమాన్యాలు పట్టించుకోవటంలేదు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్ళిన విద్యార్థులు హాల్ టిక్కెట్లు ఇవ్వాలని కోరగా, ఇవ్వమంటూ యాజమాన్యం తెగేసి చెప్పింది. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్‌తోపాటు మరికొందరు విద్యార్థి నాయకులు కళాశాల వద్ద బైఠాయించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ కళాశాల వద్ద బైఠాయించినా సమాధానం చెప్పకపోవటంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో త్రీటౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థులు ఆందోళన విరమించాలని హెచ్చరించారు. విద్యార్థులు ఆందోళన విరమించేదిలేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. త్రీటౌన్ పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు విద్యార్థి సంఘం నాయకులను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్టులు చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా
సీఆర్‌ఆర్ కళాశాల విద్యార్థులు చేపడుతోన్న ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ మద్దతు తెలిపారు. విద్యార్థులు కళాశాల వద్దే రాత్రి 9.30 గంటలైనా ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకుండా కఠినంగా వ్యవహరించటం దారుణమని బొద్దాని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే సహించేదిలేదని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. పోలీసులు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ విద్యార్థులను, ఏబీవీపీ నేతలను అరెస్టులు చేయటం దారుణమన్నారు. దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అండగా వైఎస్సార్‌సీపీ యువజన నాయకులు పసుపులేటి శేషు, దినేష్, యల్లపు మోజెస్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment