
అంబాజీపేట: చేనేతకు ఉపాధి లేక కార్మికులు వలస పోతున్నారని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద చేనేత మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేబ్రోలు క్యాంపు కార్యాలయం వద్ద జననేతను వారు కలిసి సమస్యలను వివరించారు. చేనేత పనిచేసేవారికి ఉపాధి కూలీకి ఇస్తే ఆదాయం కూడా రావడం లేదన్నారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో రుణాలు మంజూరు చేసి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటిని రద్దు చేసి పక్క రాష్ట్రాల నుంచి పవర్ లూమ్స్ వస్త్రాలు తీసుకువచ్చి స్కూల్ యూనిఫాం ఇస్తున్నారన్నారు. దీంట్లో టీడీపీ నాయకులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. అనంతరం జననేతను వారు సత్కరించారు.
చేనేత రంగాన్ని కాపాడాలన్నా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత రంగాన్ని కాడాపాలంటూ గొల్లప్రోలుకు చెందిన చేనేత కార్మికులు బండారు బాబూరావు, పలకా సుబ్బారావు తదితరులు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప యాత్రలో వారు జగన్‌ను కలుసుకుని ఈ మేరకు వినతి పత్రం అందించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన సమయంలో జిల్లాలో 50 చేనేత సంఘాలు ఉండేవని, ఎనిమిది సంఘాలు మినహా మిగిలిన సంఘాలన్నీ మూతబడే పరిస్థితికి వచ్చాయని, ఆ సమయంలో చేనేత సంఘాలకు రూ.312 కోట్లు రుణమాఫీ చేసి చేనేత కార్మికులను ఆదుకున్నారన్నారు.
అలాగే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే విధంగా జీఓ జారీ చేయడం, ఆరోగ్య బీమాతో పాటు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కార్మికుల ఆరోగ్య బీమా పథకాన్ని ఎత్తివేశారని వాపోయారు. ప్రతీ జిల్లాకు టెక్స్‌టైల్ పార్కు నిర్మించి అందులో చేనేత కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంతో చేనేత సంఘాలు కుంటుబడ్డాయన్నారు. యేటా వెయ్యి కోట్లు బడ్జెట్‌లో పెడతామని చెప్పి మాట తప్పారన్నారన్నారు. గతంలో ఒక్క గొల్లప్రోలు మండలంలోనే రెండు వేలు మగ్గాలు ఉండగా 2018 నాటికి వీటి సంఖ్య 800 పడిపోయిందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. జీఎస్టీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్‌ల వలన చేనేత రంగం దెబ్బతింటోందని వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై దృష్టి సారించడంతో పాటు చేనేత వర్గానికి ఉచిత విద్యుత్‌ను అందించాలని, మత్స్య కార్మికుల మాదిరిగా చేనేత కార్మికులకు కూడా వర్షాకాలంలో పనికి ఆహారపథకం అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment