హరహర మహాదేవ శంభో
ఏ నోట విన్నా పంచాక్షరీ మంత్ర జపమే... ఏ దారిని కన్నా పంచ భూతాత్ముడైన ఆ పరమ శివుని ఆలయాలకు చేరుతున్న జనమే. హరహర మహాదేవ అంటూ ఆ బోళా శంకరుడుని ఆర్తిగా స్మరిస్తూ, తమ శక్తి మేరకు అర్చిస్తూ, అభిషేకిస్తూ భక్తులు అలౌకికానందంలో తేలియాడారు... సుఖశాంతులు ప్రసాదించాలని ఆ జంగమదేవరను శరణచొచ్చారు.
నర్సీపట్నం: బలిఘట్టంలో త్రిశూల పర్వతంపై వేంచియున్న శ్రీ బ్రహ్మలింగేశ్వరస్వామిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. స్వామికి మహోన్యాసపూర్వక రుద్రాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించారు. ఉత్తర వాహిని నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పురోహితులతో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. పితృదేవతులను మననం చేస్తూ బుడగజంగాల మంత్రోచ్ఛారణలతో నదీ ప్రాంతం కోలాహాలంగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్వామి వారి ఆలయ సమీపంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. బలిఘట్టం యూత్ సభ్యులు భక్తులకు పులిహార, మజ్జిగ పంపిణీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి వాహనాలను క్రమబద్ధీకరించారు. పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పంచదార్లలో...
రాంబిల్లి: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పంచదార్ల పుణ్యక్షేత్రం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలలు నుంచి వేకువజామునే భక్తులు ఇక్కడకు చేరుకొని తొలుత ఆకాశధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉమా ధర్మలింగేశ్వరస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి, సహస్ర లింగేశ్వరస్వామి వార్లను దర్శించుకొని పూజలు చేశారు. క్షేత్రపాలకుడైన ధర్మలింగేశ్వరస్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ధర్మలింగేశ్వరస్వామిని దర్మించుకునేందుకు, ఆకాశధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. సర్పంచ్ వసంతవాడ వెంకటేశ్వరరావు(దిన్‌బాబు), డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ దంపతులతో పా టు వేలాది మంది భక్తులు ఉమా ధర్మలింగేశ్వర స్వా మిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాల అనంతరం అర్చకులు తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.