
నల్గొండ జిల్లాలో కారు ప్రమాదంలో మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ (61) చనిపోవడంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన ఆకస్మిక మరణవార్త గ్రామంలో ప్రతి ఒక్కరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది. తమ అభిమాన నాయకుడు దుర్మరణం చెందారని తెలిసి నిమ్మకూరు భోరున విలపించింది. చైతన్య రథ సారధి హరికృష్ణ ఇక లేరన్న వార్తతో నిద్రలేవాల్సి రావడాన్ని వారిని తీవ్రంగా కలిచి వేస్తోంది. తమ గ్రామానికి అండ పోయిందని గ్రామస్తులు కలత చెందారు. ఆయన తండ్రి ఎన్‌టీఆర్ మరణంతో కృంగిపోయాం..ఇపుడికి మరో పెద్ద దిక్కును కోల్పోయామంటూ వారు భోరున విలపించారు. గ్రామంలో ప్రతీ ఒక్కరినీ పేరు పెట్టి పిలిచే అనుబంధం హరికృష్ణది, ఎన్‌టీఆర్ కుటుంబంలో ఈ గ్రామంలో అందరికి తెలిసిన వ్యక్తి ఆయనొక్కడే అని ఆయన బంధువులు, సన్నిహితులు కన్నీరు పెట్టారు.
మరోవైపు ఆయన తుదిశ్వాస విడిచిన కామినేని ఆసుపత్రి వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఆయన కుమారులతోపాటు,సోదరి, బీజేపీ నేత పురందేశ్వరి కూడా ఆసుపత్రికి చేరుకుని అన్నకు నివాళులర్పించారు. అలాగే హరికృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు, శ్రేణులు ఆసుపత్రికి భారీగా తరలివస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని హరికృష్ణ నివాసంలో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.హరికృష్ణ భౌతికకాయాన్ని ఆయనకెంతో ఇష్టమైన ఆయన నివాసానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా ఎన్‌టీఆర్ తరువాత నిమ‍్మకూరు గ్రామంతో హరికృష‍్ణది విడదేయలేని బంధం సెప్టెంబర్ 2,1956లో నిమ్మకూరులోనే హరికృష్ణ జన్మించారు. హరికృష్ణ బాల్యం, విద్యాబ్యాసం, వివాహం అన్నీ నిమ్మకూరులోనే జరిగాయి. హరికృష్ణ భార్య లక్ష్మీది కూడా నిమ్మకూరే. ఎంపీగా, మంత్రిగా ఉన్న సమయంలో స్వస్థలం నిమ్మకూరులో ఆయన పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన సేవలను గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు జానకీ రాం రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో హరికృష్ణ మానసికంగా బాగా కృంగిపోయారనీ, చివరిసారిగా 10నెలల క్రితం కుమారుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి హరికృష్ణ నిమ్మకూరు వచ్చారంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగతనేత నందమూరి తారక రామారావుకు మూడవ కుమారుడైన హరికృష్ణ సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment