పీవీ కాలనీ (మణుగూరు), న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమైన భద్రాచలాన్ని వదులుకునేది లేదని టీఆర్‌ఎస్ శాసన సభ్యుడు టి.హరీష్‌రావు అన్నారు. పీవీ కాలనీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ కోసం ఎలా ఉద్యమించామో.. అంతకు రెట్టింపుగా భద్రాచలం కోసం ఉద్యమిస్తాం’ అన్నారు. సీమాంధ్రులు భద్రాద్రి రామునిపై ప్రేమతో భద్రాచలాన్ని తీసుకోవడం లేదని అన్నారు.
గోదావరి నదీజలాలను దోచుకుని తమ వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసుకునేందుకు, ఇక్కడి గిరిజనులను ముంచేందుకే వారు భద్రాచలం కావాలంటున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలో అంగుళం స్థలాన్ని కూడా సీమాంధ్రులకు వదులుకునే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాద్‌పై అన్ని హక్కులు తెలంగాణ రాష్ట్రానికే ఉండాలన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులకు తగిన భద్రత ఉంటుందన్నారు. ఇప్పటివరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో హైదరాబాదులోని ఏ ఒక్క సీమాంధ్రునిపై కూడా దాడి జరగలేదన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో తెలంగాణ ప్రజలపై దాడులు జరిగాయన్నారు. ఈ నెల 12న ఢిల్లీలో జీఎంఓ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారని, ఎటువంటి షరతులు లేని తెలంగాణ కావాలని కోరతారని చెప్పారు. హైదరాబాదును యూటీ చేస్తామన్నా, భద్రాచలాన్ని ఆంధ్రాలో కలుపుతామన్నా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేంగర్ల మల్లయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటైన తరువాత డిపెండెంట్ ఉద్యోగాలు సాధించుకుంటామని తెలంగాణ బొగు ్గగని కార్మిక సంఘం రాష్ర్ట్ర అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య అన్నారు. ఇప్పటికే తెలంగాణ కార్మికుల కోసం అనేక హక్కులు సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బొగ్గు గని కార్మికుల పోరాటం మరువలేనిదన్నారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మహిళా విబాగం రాష్ట్ర అధ్యక్షురాలు తులం ఉమ, జిల్లా ఇన్‌చార్జి నరెష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలాన్ని వదులుకునేది లేదు
Published Sat, Nov 9 2013 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement