తాండూరు, న్యూస్‌లైన్: చదువుకునే వయసులో మూడు ‘ముళ్ల’ బంధంతో బాలికల జీవితాలను నాశనం చేయొద్దని జిల్లా బాలల న్యాయ మండలి ప్రధాన న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల పెద్దేముల్ మండలంలో జరిగిన ‘జోగిని’ ఘటన నేపథ్యంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక్‌బాబు ఆదేశాల మేరకు బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధి చెందుతున్నా దేశంలో ఇంకా జోగిని వ్యవస్త, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు ఉండడం దారుణమన్నారు. బాలిక లకు చిన్న వయసులో వివాహాలు చేసి తమ భారం తీరుతుందనే ధోరణిని తల్లిదండ్రులు వీడనాడాలని ఆయన సూచించారు. ప్రతి ఆడపిల్ల ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగం చేసేలా ప్రోత్సహించాలన్నారు. మైనారిటీ తేరాకే ఆడపిల్ల పెళ్లి గురించి ఆలోచించాలని న్యాయమూర్తి సూచించారు. బాల్య వివాహాలు నేరమని, దానికి ప్రోత్సహించినా, బాధ్యులైనా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలను వదిలిపెట్టి అభ్యుదయంగా జీవించాలని చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా జోగిని వ్యవస్థ కొనసాగుతుండటం పట్ల న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బలవంతంగా పెళ్లి చేయాలని చూసినా, వివక్షత చూపినా తమ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈనెల 24న వికారాబాద్‌లో ఉపాధ్యాయులు, పోలీసులతో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు న్యాయమూర్తి చెప్పారు. కార్యక్రమంలో తాండూరు మున్సిఫ్ కోర్టు మేజిస్ట్రేట్ హరీష మాట్లాడుతూ.. ఇటీవల ‘జోగిని’ ఘటనలో ముక్కుపచ్చలారని బాలికను 60 ఏళ్ల వృద్ధుడితో వివాహం జరిపించడం అనారికమన్నారు. నేటీ సాంకేతిక యుగంలోనూ ఈ వ్యవస్థ ఉండడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు.
విద్యతోనే మూఢనమ్మకాలు నశించి గ్రామాలు, జీవితాలు బాగుపడతాయని అన్నారు. మూఢనమ్మకాలు, బాల్య వివాహాలతో అభివృద్ధి కుంటుపడుతుందని మేజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారు. ప్రతిఒక్కరు చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం బాలల సంక్షేమంపై బాలల న్యాయ మండలి రూపొందించిన రెండు పోస్టర్లను దుర్గాప్రసాద్, హరీషలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జువైనల్ జస్టీస్ బోర్డు మెంబర్ వెంకటేశ్వర్లు, తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, జిల్లా బాలల ఉచిత న్యాయ సహాయ న్యాయవాది సుభాష్ చంద్రబోస్, పెద్దేముల్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అక్కమదేవి, రూరల్ సీఐ రవికుమార్, కరన్‌కోట్ ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్, న్యాయవాదులు జనార్దన్‌రెడ్డి, విజయ లక్ష్మీపండిట్, విద్యార్థులు ఉన్నారు.
బాల నేరస్తులతో సున్నితంగా వ్యవహరించాలి
వికారాబాద్: పిల్లలను నేరారోపణపై పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చినప్పుడు పోలీసులు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని బాలల న్యాయమండలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాలల సలహా సహాయ కేంద్రాన్ని దుర్గాప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాల నేరస్తులతో పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని, లేకపోతే వారి భవిష్యత్ అంధకారమవుతుందన్నారు.
పిల్లలు నేరాలకు పాల్పడితే అందులో తల్లిదండ్రులది, గురువులది కూడా కొద్దివరకు బాధ్యత ఉంటుందని చెప్పారు. వీరిద్దరిపై పిల్లలను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్య త ఉందన్నారు. బాల నేరస్తులను పోలీస్‌స్టేషన్లలో బందీలుగా ఉంచరాదన్నారు. బాల నేరస్తులను విచారించేందుకు ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు ఒక ప్రత్యేకాధికారిని ఎస్పీ నియమించినట్లు చెప్పారు. నిందితులు మైనర్లయితే వారికి న్యాయ సహాయం అందించేందుకు ప్రతి పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాలల సహాయ కేంద్రం బోర్డును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి మీడియా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌హెచ్‌వో లచ్చీరాంనాయక్, ఎస్‌ఐ హన్మ్యానాయక్, బాలల న్యాయమండలి సభ్యులు వెంకటేశ్వర్లు, జి.సుభాష్‌చంద్రబోస్, ఏఎస్‌ఐ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన శిక్షలు
Published Thu, Feb 13 2014 12:16 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement