లక్ష్యం వైపే గురి | Harshitha Select In National Team For Raifil Shooting | Sakshi
Sakshi News home page

లక్ష్యం వైపే గురి

Published Sat, Sep 8 2018 6:56 AM | Last Updated on Sat, Sep 8 2018 6:56 AM

Harshitha Select In National Team For Raifil Shooting - Sakshi

రైఫిల్‌ షూటింగ్‌లో హర్షితకు శిక్షణ ఇస్తున్న కోచ్‌ కృష్ణారావు

పశ్చిమగోదావరి, భీమవరం: అతనో చిరువ్యాపారి. చిన్నతనం నుంచీ రైఫిల్‌ షూటింగ్‌ అంటే మహా ఇష్టం. తుపాకీతో లక్ష్యాన్ని గురి పెట్టాలని ఆశ.. అయితే అతని ఆశ నెరవేరలేదు. దాంతో తన కోరికకు కుమార్తె ద్వారా నెరవేర్చుకోవాలని సంకల్పించారు. తండ్రి ఆశయానికి తగ్గట్టుగానే  14 ఏళ్ల వయస్సులోనే  రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత పతకం సాధించడమేగాక   జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై తండ్రిని అబ్బుర పర్చింది ఆచిన్నారి.

రెండేళ్ల నుంచి శిక్షణ
భీమవరం పట్టణానికి చెందిన ముదుండి సత్యనారాయణరాజు పట్టణంలోని జువ్వలపాలెం రోడ్డులో హర్షిత ఫుడ్స్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె  హర్షిత స్థానిక శ్రీచైతన్య టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతోంది.  హర్షితకు  ఆర్చరీపై మక్కువ ఏర్పడింది. ఆర్చరీలో శిక్షణ పొందాలని  పట్టణానికి చెందిన కోచ్‌ కుంటముక్కల గోపాలగాంధీ కృష్ణారావు వద్దకు వెళ్లగా  ఆమె ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ బట్టి రైఫిల్‌ షూటింగ్‌లో రాణించగలుగుతుందని సూచించడంతో  హర్షితకు రెండేళ్ల నుంచి   రైఫిల్‌ షూటింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు.

జాతీయ స్థాయిలో 23వ స్థానం
మంచి క్రమశిక్షణ, పట్టుదల కలిగిన హర్షిత రైఫిల్‌ షూటింగ్‌లో మంచి ప్రతిభ కనబర్చడంతో  ఈ ఏడాది ఆగస్టు 14న  హైదరాబాద్‌లో జరిగిన  రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా తర్ఫీదు ఇచ్చారు. ఈ పోటీల్లో  హర్షిత రజత పతకం సాధించింది. దీంతో హర్షితకు మరిన్ని పతకాలు సాధించాలనే పట్టుదల పెరిగి శిక్షణలో మరింతగా దృషి ్టపెట్టింది. ఒక పక్క చదువుపై శ్రద్ధ చూపిస్తూనే రైఫిల్‌ షూటింగ్‌  శిక్షణకు ఎక్కువ సమయం కేటాయించింది. ఆగస్టు 30 నుంచి 9 రోజుల పాటు తమిళనాడులో నిర్వహించిన  ఫ్రీ నేషనల్స్‌ స్మాల్‌ బోర్‌ రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో  హర్షిత జాతీయ స్థాయిలో 23వ స్థానంలో నిలిచి తండ్రి కలలను సాకారం చేసింది.  అండర్‌–14 విభాగంలో రాష్ట్ర స్థాయిలో హర్షిత ప్రథమ స్థానంలో నిలవడం విశేషం.  దీంతో  నవంబర్‌లో ఢిల్లీలో నిర్వహించనున్న నేషనల్‌ స్మాల్‌ బోర్‌ రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు ఎంపికైందని  కోచ్‌ కృష్ణారావు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement