raifil shooting
-
అవని ఆనందం ఆకాశమంత...
పదకొండేళ్ల వయసు... ఆడుతూ పాడుతూ అన్నింటా తానే అయి అవని కనిపించేది. చురుకుదనానికి చిరునామాలా ఉండే ఆ అమ్మాయి జీవితంలో ఒక్కసారిగా చీకటి అలముకుంది. అయితే అనూహ్యంగా ఎదురైన కారు ప్రమాదం ఆమెను ఒక్కసారిగా అగాధంలోకి పడేసింది. జీవితం పట్ల ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోని, ఎలా ముందుకు వెళ్లాలో తెలీని వయసు! లేడి పిల్లలా సాగే పరుగు ఆగిపోయి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి రావడం అవనికి తీవ్ర ఆవేదనను మిగిల్చింది. దాంతో సహజంగానే తన బాధను, అసహనాన్ని, ఆగ్రహాన్ని తల్లిదండ్రుల మీద చూపించేది. అలాంటి స్థితి నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చిన ప్రయత్నం ఒక ఒలింపిక్ చాంపియన్‌ను తయారు చేసింది. రాజస్తాన్ రాజధాని జైపూర్ అవనీ లేఖరా స్వస్థలం. 2012లో జరిగిన కారు ప్రమాదంలో ఆమె వెన్నుపూస విరిగిపోయింది. నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోవడంతో ఇక చేసేందుకు ఏమీ లేక వీల్‌చైర్‌లోనే ఆమె జీవితం కొత్తగా మొదలైంది. సుమారు మూడేళ్లపాటు అవని తీవ్ర క్షోభ అనుభవించింది. అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు చదవడం మినహాయిస్తే మరో వ్యాపకం లేకపోయింది. ఒకరోజు ఆమెను ఈ జ్ఞాపకాల నుంచి కాస్త దూరంగా, బయటి ప్రపంచంలోకి అడుగు పెడితే బాగుంటుందని భావించిన తండ్రి ప్రవీణ్ సమీపంలోని షూటింగ్ రేంజ్‌కు తీసుకుపోయాడు. నగరంలోని జగత్‌పుర వద్ద ఉన్న షూటింగ్ రేంజ్ మొదటి సారే ఆమెను ఆకట్టుకుంది. అయితే అది సరదాగా మాత్రమే. పూర్తి స్థాయిలో ప్లేయర్ కావాలనే ఆలోచన రానేలేదు. ఇలాంటి స్థితిలో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీ ‘ఎ షాట్ ఎట్ గ్లోరీ’ని చదివే అవకాశం కలిగింది. అంతే... ఆ విజయ ప్రస్థానం ఒక్కసారిగా అవనిలో స్ఫూర్తి నింపింది. దాంతో మెల్లగా షూటింగ్‌పై ఆసక్తిని పెంచుకుంది. కూతురిలో వచ్చిన మార్పును గమనించిన తండ్రి ఆమెకు సరైన దిశానిర్దేశం చేసేందుకు ఇదే తగిన సమయమని భావించాడు. అవని పూర్తి స్థాయిలో షూటింగ్ క్రీడపై దృష్టి పెట్టే అవకాశం కల్పించాడు. కోచింగ్ సౌకర్యం, ఎక్విప్మెంట్ అందించే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అవనికి థెరపీ చేయాల్సిన ఫిజియో కరోనా సమయంలో చాలా దూరం నుంచి రావాల్సి ఉండటంతో ఇబ్బంది లేకుండా ఆ బాధ్యతలు కూడా తల్లిదండ్రులే తీసుకున్నారు. ఈ ఆరేళ్ల శ్రమ ఇప్పుడు అవనిని ఒలింపిక్ విజయం శిఖరంపై నిలబెట్టింది. బింద్రా ప్రేరణగా ముందంజ వేసిన ఆ అమ్మాయి ఇప్పుడు ఒలింపిక్ స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా తనకంటూ కొత్త చరిత్రను లిఖించుకుంది. వరుస విజయాలతో... ఒలింపిక్ పతకంతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నా... గత నాలుగేళ్లుగా అవని నిలకడగా విజయాలు సాధిస్తూనే వచ్చింది. 2017లో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం జరగ్గా, జూనియర్ స్థాయిలో ప్రపంచ రికార్డుతో సత్తా చాటింది. అదే ఏడాది బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యంతో తొలిసారి అవని వెలుగులోకి వచ్చింది. తర్వాతి ప్రపంచకప్ (క్రొయేషియా)లో అంతకంటే మెరుగైన ప్రదర్శనతో రజతం సాధించిన ఆమె... 2019లోనూ దానిని నిలబెట్టుకుంది. భారత మాజీ షూటర్ సుమా శిరూర్ ఈ ప్రస్థానంలో అవనికి కోచ్‌గా వ్యవహరించింది. గత రెండేళ్లుగా ఒలింపిక్స్ కోసమే ప్రత్యేక ప్రణాళికతో వీరు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న అవని రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖలో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హోదాలో విధులు నిర్వహిస్తోంది. మరోవైపు జైపూర్ యూనివర్సిటీ నుంచి ‘లా’ కూడా చదువుతోంది. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. ప్రపంచాన్ని గెలిచినట్లుగా అనిపిస్తోంది. నా పతకాన్ని భారతీయులందరికీ అంకితమిస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకముంది. గతం గురించి, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం లేదు. నేను వర్తమానంలోనే జీవించడాన్ని ఇష్టపడతాను. ఫైనల్లో బరిలోకి దిగినప్పుడు కూడా పతకం లక్ష్యంగా పెట్టుకోలేదు. ఒక్కో షాట్ సమయంలో ఆ ఒక్క షాట్ గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. తొలిసారి రైఫిల్ పట్టుకున్నప్పుడు ఎంతో ఆనందం కలిగింది. ఇక దాంతో పెనవేసుకుపోయిన నా అనుబంధం ఇక్కడి వరకు తీసుకొచ్చింది. –అవనీ లేఖరా -
బుల్లెట్.. దిగాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: రైఫిల్ షూటింగ్లో ఖమ్మం బాలిక కొండపల్లి శ్రీయారెడ్డి ఉత్తమ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గచ్చిబౌలి స్టేడియంలో శిక్షణ పొందిన శ్రీయ ఇప్పటికే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో కాంస్య పతకం సాధించింది. భోపాల్‌లో ఈ నెల 19 నుంచి జనవరి 4 వరకు జరుగుతున్న జాతీయ జూనియర్ రైఫిల్ షూటింగ్లో తెలంగాణ తరపున ప్రాతినిథ్యం వహిస్తూ ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ పోటీల్లో ఇప్పటి వరకు సీనియర్ల పాయింట్ల కన్నా అధికంగా సాధించింది. మొత్తం 587 పాయింట్లకు గానూ, ఏకంగా 604.6 పాయింట్లు సాధించింది. సీనియర్ కేటగిరీల్లో సాధించే పాయింట్లు సాధించడంతో భారత తుది జట్టుకు ఎంపిక చేసే అర్హత ఎంపికలకు శ్రీయారెడ్డి ఎంపికైంది. భారత జట్టులో చోటు దక్కుతుంది భారత జట్టులో స్థానం సాధిస్తుందని శ్రీయారెడ్డి ప్రత్యేక శిక్షకుడు మేడి షణ్ముగం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే క్వాలిఫై ట్రయల్స్ జనవరి చివరి వారంలో ఉంటాయని చెప్పారు.– శ్రీయారెడ్డి శిక్షకుడు మేడి షణ్ముగం తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే.. నా తల్లిదండ్రులు చైతన్య, రవీందర్‌రెడ్డి ప్రోత్సాహం వల్లే జాతీయస్థాయిలో ప్రతిభ చాటుతునున్నాను. నా పాఠశాల యాజమాన్యం కూడా అన్ని విధాలా సహకరిస్తోంది. – కొండపల్లి శ్రీయారెడ్డి -
లేడీ డిజైనర్.. రైఫిల్ షూటర్..
చదివిన కోర్సు ఒకటి.. చేసిన ఉద్యోగం ఇంకోటి..ఆ రెండింటిలోనూ ‘కిక్’ లేక తనను తానే ‘డిజైన్’ చేసుకుంది. ఫ్యాషన్ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ‘స్టార్ డిజైనర్’గా పేరు తెచ్చుకుంటోంది ‘హారికారావు’. ఎంతోమంది సెలబ్రిటీలకు దుస్తులు రూపొందించి ఇచ్చే ఈమె తుపాకీ పేల్చడంలోనూ దిట్టేనండోయ్. తూర్పు–పడమర లాంటి రెండు విభిన్న రంగాల్లోదూసుకుపోతున్న హారిక.. తన ప్రయాణ విశేషాలను‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. శ్రీనగర్‌కాలనీ : ‘‘నేను పుట్టింది, పెరిగింది అంతా వరంగల్‌లోనే. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. చిన్ననప్పటి నుంచి అందరికంటే భిన్నంగా ఉండడం నాకు అలవాటు. మొదట నా దుస్తులు అందరికి నచ్చేలా కొత్తగా ఉండాలనుకునేదాన్ని. అలా ఫ్యాషన్‌పై ఇష్టం పెరిగింది. కొంత ఊహ వచ్చాక నా దుస్తులు నేనే డిజైనింగ్ చేసుకునేదాన్ని. అవి నచ్చి సన్నిహితులు, బంధువులు అలాంటివి చేసి ఇవ్వమనేవారు. అలా శుభకార్యాలకు దుస్తులు డిజైన్ చేసేదాన్ని. కొత్త రంగుల మేళవింపుతో డిజైనింగ్స్ ఇచ్చేదాన్ని. నా సృజనాత్మకత నచ్చి చాలా మంది ప్రశంశించేవారు. అయితే ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని కోరిక ఉన్నా వరంగల్‌లో శిక్షణా కేంద్రాలు లేకపోవడంతో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. పతకాలే లక్ష్యం... కాలేజీ రోజుల్లో ఎన్సీసీలో చేరాను. అక్కడే రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నా. ఆ శిక్షణతో ప్రతిష్టాత్మక జీవీ మౌలాంకర్ షూటింగ్ పోటీల్లో పాల్గొన్నాను. డిజైనింగ్‌తో పాటు షూటింగ్లో ఉన్న అభిరుచితో ఫిలింనగర్‌లోని గగన్ నారంగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పటికే లెవెల్–1 పూర్తి చేశాను. అందరూ మెచ్చేలా రైఫిల్ షూటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని పతకాలు సాధించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నా. కుటుంబమే నా బలం నేను ఎంచుకున్న రెండు రంగాలు విభిన్నమైనవి. ఒకదానిదో మరొక దానికి పొంతన ఉండదు. నా ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యులతో పాటు నా భర్త సత్య ప్రోత్సాహం ఎంతో ఉంది. ఉద్యోగం చేస్తుంగా వివాహమైంది. నా ఇష్టాన్ని గుర్తించిన నా భర్త ప్రోత్సాహంతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశా. ఇప్పుడు మెహిదీపట్నంలో హారిక స్టూడియోస్‌ను ఏర్పాటు చేశాను. విదేశాల్లో జరిగిన పలు ప్యాషన్ వీక్స్‌లో నా డిజైన్స్‌ను ప్రదర్శించాను. అక్కడ మంచి గుర్తింపు వచ్చింది.సినీతారలు ఆనంది, సింగర్ చిన్మయి, విష్ణుప్రియ, ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ, పలువురు బుల్లితెర నటీమణులకు డిజైనింగ్ చేశాను. అంతర్జాతీయ డిజైనర్‌గా గుర్తింపు కోసం కృషి చేస్తున్నా’’ అంటూ ముగించారు హారిక. ఉద్యోగాన్నివదిలేశా.. ఎమ్మెస్సీ తర్వాత ఫార్మారంగంలో ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ అక్కడ ఆశించిన ఉద్యోగం రాకపోవడంతో సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని ఇన్ఫోసిస్‌లో చేరాను. ఉద్యోగంలో ఉండగా తోటి కొలీగ్స్ దుస్తులు డిజైన్ చేసేదాన్ని. అవి అందరికీ బాగా నచ్చేవి. కొన్నాళ్లకు చేస్తున్న ఉద్యోగంలో కిక్ లేకపోవడంతో అది వదిలేసి నచ్చిన ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టాను. -
లక్ష్యం వైపే గురి
పశ్చిమగోదావరి, భీమవరం: అతనో చిరువ్యాపారి. చిన్నతనం నుంచీ రైఫిల్ షూటింగ్ అంటే మహా ఇష్టం. తుపాకీతో లక్ష్యాన్ని గురి పెట్టాలని ఆశ.. అయితే అతని ఆశ నెరవేరలేదు. దాంతో తన కోరికకు కుమార్తె ద్వారా నెరవేర్చుకోవాలని సంకల్పించారు. తండ్రి ఆశయానికి తగ్గట్టుగానే 14 ఏళ్ల వయస్సులోనే రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత పతకం సాధించడమేగాక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై తండ్రిని అబ్బుర పర్చింది ఆచిన్నారి. రెండేళ్ల నుంచి శిక్షణ భీమవరం పట్టణానికి చెందిన ముదుండి సత్యనారాయణరాజు పట్టణంలోని జువ్వలపాలెం రోడ్డులో హర్షిత ఫుడ్స్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె హర్షిత స్థానిక శ్రీచైతన్య టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. హర్షితకు ఆర్చరీపై మక్కువ ఏర్పడింది. ఆర్చరీలో శిక్షణ పొందాలని పట్టణానికి చెందిన కోచ్ కుంటముక్కల గోపాలగాంధీ కృష్ణారావు వద్దకు వెళ్లగా ఆమె ఫిజికల్ ఫిట్నెస్ బట్టి రైఫిల్ షూటింగ్లో రాణించగలుగుతుందని సూచించడంతో హర్షితకు రెండేళ్ల నుంచి రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. జాతీయ స్థాయిలో 23వ స్థానం మంచి క్రమశిక్షణ, పట్టుదల కలిగిన హర్షిత రైఫిల్ షూటింగ్లో మంచి ప్రతిభ కనబర్చడంతో ఈ ఏడాది ఆగస్టు 14న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా తర్ఫీదు ఇచ్చారు. ఈ పోటీల్లో హర్షిత రజత పతకం సాధించింది. దీంతో హర్షితకు మరిన్ని పతకాలు సాధించాలనే పట్టుదల పెరిగి శిక్షణలో మరింతగా దృషి ్టపెట్టింది. ఒక పక్క చదువుపై శ్రద్ధ చూపిస్తూనే రైఫిల్ షూటింగ్ శిక్షణకు ఎక్కువ సమయం కేటాయించింది. ఆగస్టు 30 నుంచి 9 రోజుల పాటు తమిళనాడులో నిర్వహించిన ఫ్రీ నేషనల్స్ స్మాల్ బోర్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో హర్షిత జాతీయ స్థాయిలో 23వ స్థానంలో నిలిచి తండ్రి కలలను సాకారం చేసింది. అండర్–14 విభాగంలో రాష్ట్ర స్థాయిలో హర్షిత ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. దీంతో నవంబర్‌లో ఢిల్లీలో నిర్వహించనున్న నేషనల్ స్మాల్ బోర్ రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపికైందని కోచ్ కృష్ణారావు తెలిపారు. -
రైఫిల్ షూటింగ్లో సత్తాచాటిన చరదీప్
కడప ఎడ్యుకేషన్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో కడపకు చెందిన బండ్లపల్లె చరదీప్‌రెడ్డి సత్తా చాటాడు. కడప నారాయణ ఒలంపియాడ్ జూని యర్ కళాశాల ప్రధమ సంవత్సర ఇంటర్ చదువుతున్న ∙బండ్లపల్లె చరదీప్‌రెడ్డి సబ్ జూనియర్ రైఫిల్ షూటింగ్లో రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బండ్లపల్లె చరదీప్‌రెడ్డి కడప డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి కుమారుడు. గుంటూరులో 17వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ లెవల్ రైఫిల్ çషూటింగ్ 2016 పోటీలను మూడు రోజుల పాటు నిర్వహించారు. ఇందులో చరదీప్‌రెడ్డి ప్రతిభ చాటడంతో తల్లిదండ్రులు డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి, కల్పలతారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. నారాయణ ఒలంపియాడ్ డీజీఎం రామ్మోహన్‌రెడ్డి, డీన్ చంద్రకిషోర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ మురళీమోహన్‌లు చరదీప్రెడ్డికి అభినందనలు తెలిపారు.