కరుణించు..మేరీమాత
విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల మేరీమాత ఉత్సవాల మొదటిరోజు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడ కథోలిక పీఠం గురువులు లాంఛనప్రాయంగా ఉత్సవాలను ప్రారంభించగా, బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై ఉదయం 7 గంటలకు తొలి సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుడివాడ విచారణ జుబిలేరియన్ గురువు ఫాదర్ గూడా మెల్కియార్ రాజు ప్రథమ సందేశాన్ని అందించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు మేరీమాత ఆశీస్సులతో క్షేమంగా జీవించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్ర గురువులు సమష్టి దివ్యబలిపూజ సమర్పించారు. అనంతరం భక్తులకు దివ్యసత్ప్రసాదాన్ని అందజేశారు. గురుత్వసేవలో 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఫాదర్ గూడా మెల్కియార్‌రాజును సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప, సోషల్ సర్వీస్ సెంటర్ డెరైక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, చాన్సలర్ ఫాదర్ జె.జాన్‌రాజు, ఫాదర్ వెంపని, కథోలిక నాయకులు మద్దాల అంతోని, వడ్లపాటి డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మేరీమాత తేరు ప్రదక్షిణ వైభవంగా జరిగింది. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, యువజన నాయకుడు దేవినేని అవినాష్ ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రదక్షిణను ప్రారంభించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మేరీమాత స్వరూపాన్ని గుణదల పురవీధులైన లూర్దునగర్, బెత్లహాంనగర్ తదితర ప్రాంతాల్లో ఊరేగించారు. సాయంత్రం ఆరు గంటలకు ఫాదర్ గోరంట్ల జాన్నేసు సమష్టి దివ్యబలిపూజ సమర్పించారు.
భక్తుల వెల్లువ
ఆదివారం సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానాలయం నుంచి కాలినడకన మేరీమాత స్వరూపం వద్దకు చేరుకున్న భక్తులు అక్కడ అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండ శిఖరాగ్రాన ఉన్న ఏసుక్రీస్తు శిలువ వద్దకు చేరుకుని కొవ్వొత్తులు వెలిగించారు. సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. మొదటిరోజు దాదాపు రెండు లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చారని ఉత్సవ కమిటీ అంచనా వేసింది.
ఏర్పాట్లు భేష్
ఉత్సవ కమిటీ చేసిన ఏర్పాట్లపై భక్తులు ప్రశంసలు కురిపించారు. బిషప్ గ్రాసీ పాఠశాల ఆవరణలోని చలువ పందిళ్లలో ఒకేసారి చాలామంది భక్తులు సేదతీరారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా తాగునీటి సౌకర్యం ఎక్కువగా కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లోనూ బాంబ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు చేపట్టాయి.
ఆకట్టుకున్న బైబిల్ ప్రదర్శన
ఉత్సవాల్లో భాగంగా బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బైబిల్ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మేరీమాత దర్శనాలు, ఏసుక్రీస్తు జననం, పది ఆజ్ఞలు పొందిన మోషే భక్తుడి చరిత్ర వంటి అంశాలతో కూడిన ప్రదర్శనను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దేవదూత ప్రత్యక్షమై మేరీమాతకు ఏసుక్రీస్తు జన్మిస్తాడని ప్రకటించే ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏసుక్రీస్తుకు శిష్యుడైన పేతురు జీవితంలో ఎదురైన ‘పడవలో చేపలు పట్టు అనుభవం’ అంశాన్ని వివరిస్తూ ప్రదర్శనను చూడచక్కగా ఏర్పాటుచేశారు.