Merimata Fairs
-
తల్లి్ల మరియా... కాచికాపాడుమమ్మా!
శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మేరిమాత మహోత్సవం నేడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద మరియగిరిపై జరుగుతోంది. ఈ కొండపై వెలసిన మరియమ్మకు శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి అడ్డగట్ల ఇన్నయ్య ఆధ్వర్యంలో ఏటా జనవరి 30న ప్రత్యేక దివ్యపూజలు నిర్వహిస్తారు. ‘విశ్వ స్వరూపుడైన దేవదేవుని పుత్రుని నీ వరాల గర్భంబున ధరియించిన మేరిమాతా వందనం అభివందనం..’ అంటూ, ‘దేవునిచే ఎన్నుకొనబడిన ఓ సుధాభాషిణి నీకే వందనం.. దైవప్రజలారా.. దైవ జనమా..’ అంటూ బిషప్ ఇన్నయ్య స్తోత్రం పలికి పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ యాత్రకు ఒక రోజు ముందే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు ఒడిశ్సా రాష్ట్రం నుండి తండోపతండాలుగా క్రైస్తవులు, హిందువులు తరలివచ్చి దివ్యపూజలో పాల్గొంటారు. అనంతరం మరియగిరి కొండను అధిరోహించి మేరిమాతను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. కులమతాలకు అతీతం మరియగిరి యాత్ర రోజున ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. మఠకన్యలు, పీఠాధిపతులు, క్రైస్తవ గురువుల ప్రత్యేక ప్రార్థనలతో మేరిమాత స్తోత్రం మారు మ్రోగుతుంది. ఈ సందర్భంగా మేరిమాతను దర్శించుకొనేందుకు కులమతాలకు అతీతంగా భక్తులు కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి, హిందూ సంప్రదాయంలో ఉన్నట్లు తలనీలాలు అర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ‘ఓ తల్లీ మరియా.. మమ్మల్ని కాచికాపాడుమమ్మా’ అంటూ ప్రార్థనలు చేస్తారు. దివ్య పూజలో క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ మరియమ్మను స్తుతిస్తారు. కుటుంబ సమేతంగా మేరీమాతను దర్శించుకున్న తర్వాత భక్తులు వనభోజనాలు చేస్తారు. ఏటా 25 వేల నుండి 30 వేల మంది భక్తులు హాజరై మేరీమాతను దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నేటి మరియగిరి యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి తరలివచ్చే భక్తుల కోసం పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం, సాలూరు, టెక్కలి, విజయనగరం తదితర ఆర్టీసీ డిపోల నుండి స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. ఈ ఏడాది సుమారు 35 వేలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్న అంచనాతో మరియగిరి వద్ద ప్రత్యేక ఆర్టీసీ కంట్రోల్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. -
కరుణించు..మేరీమాత
విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల మేరీమాత ఉత్సవాల మొదటిరోజు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడ కథోలిక పీఠం గురువులు లాంఛనప్రాయంగా ఉత్సవాలను ప్రారంభించగా, బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై ఉదయం 7 గంటలకు తొలి సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుడివాడ విచారణ జుబిలేరియన్ గురువు ఫాదర్ గూడా మెల్కియార్ రాజు ప్రథమ సందేశాన్ని అందించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు మేరీమాత ఆశీస్సులతో క్షేమంగా జీవించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్ర గురువులు సమష్టి దివ్యబలిపూజ సమర్పించారు. అనంతరం భక్తులకు దివ్యసత్ప్రసాదాన్ని అందజేశారు. గురుత్వసేవలో 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఫాదర్ గూడా మెల్కియార్రాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప, సోషల్ సర్వీస్ సెంటర్ డెరైక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, చాన్సలర్ ఫాదర్ జె.జాన్‌రాజు, ఫాదర్ వెంపని, కథోలిక నాయకులు మద్దాల అంతోని, వడ్లపాటి డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మేరీమాత తేరు ప్రదక్షిణ వైభవంగా జరిగింది. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, యువజన నాయకుడు దేవినేని అవినాష్ ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రదక్షిణను ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మేరీమాత స్వరూపాన్ని గుణదల పురవీధులైన లూర్దునగర్, బెత్లహాంనగర్ తదితర ప్రాంతాల్లో ఊరేగించారు. సాయంత్రం ఆరు గంటలకు ఫాదర్ గోరంట్ల జాన్నేసు సమష్టి దివ్యబలిపూజ సమర్పించారు. భక్తుల వెల్లువ ఆదివారం సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానాలయం నుంచి కాలినడకన మేరీమాత స్వరూపం వద్దకు చేరుకున్న భక్తులు అక్కడ అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండ శిఖరాగ్రాన ఉన్న ఏసుక్రీస్తు శిలువ వద్దకు చేరుకుని కొవ్వొత్తులు వెలిగించారు. సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. మొదటిరోజు దాదాపు రెండు లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చారని ఉత్సవ కమిటీ అంచనా వేసింది. ఏర్పాట్లు భేష్ ఉత్సవ కమిటీ చేసిన ఏర్పాట్లపై భక్తులు ప్రశంసలు కురిపించారు. బిషప్ గ్రాసీ పాఠశాల ఆవరణలోని చలువ పందిళ్లలో ఒకేసారి చాలామంది భక్తులు సేదతీరారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా తాగునీటి సౌకర్యం ఎక్కువగా కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లోనూ బాంబ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు చేపట్టాయి. ఆకట్టుకున్న బైబిల్ ప్రదర్శన ఉత్సవాల్లో భాగంగా బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బైబిల్ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మేరీమాత దర్శనాలు, ఏసుక్రీస్తు జననం, పది ఆజ్ఞలు పొందిన మోషే భక్తుడి చరిత్ర వంటి అంశాలతో కూడిన ప్రదర్శనను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దేవదూత ప్రత్యక్షమై మేరీమాతకు ఏసుక్రీస్తు జన్మిస్తాడని ప్రకటించే ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏసుక్రీస్తుకు శిష్యుడైన పేతురు జీవితంలో ఎదురైన ‘పడవలో చేపలు పట్టు అనుభవం’ అంశాన్ని వివరిస్తూ ప్రదర్శనను చూడచక్కగా ఏర్పాటుచేశారు. -
మేరీమాత ఉత్సవాలకు సర్వం సిద్ధం
విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల పుణ్యక్షేత్రంలో మూడురోజుల పాటు జరిగే మేరీమాత ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు విజయవాడ కథోలిక పీఠం పాలనాధికారి బిషప్ గోవింద్ జోజి, పుణ్యక్షేత్ర గురువులు తొలి సమిష్టి దివ్య బలి పూజ చేయడంతో ఉత్సవాలు మొదలవుతాయి. తిరునాళ్లకు లక్షలాదిగా హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మేరీమాత ఆలయాన్ని రంగు రంగుల తోరణాలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ప్రధానంగా బిషప్‌గ్రాసి పాఠశాల ఆవరణలో జరిగే సమిష్టి దివ్యబలి పూజ కార్యక్రమాలకు హాజరవుతారు. ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుణ్యక్షేత్ర పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచే నిమిత్తం కార్పొరేషన్ అధికారులు దాదాపు 150 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. ఆలయ కమిటీ వారు మరో 150 మందిని ఏర్పాటు చేశారు. వీరంత వివిధ షిఫ్టుల్లో 24 గంటల పాటు తమ సేవలందిస్తారు. బిషప్ గ్రాసి ఆవరణ, ప్రధానాలయం వద్ద దాదాపు 6 ప్రదేశాలలో మంచి నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు.గుణదల వంతెన వద్ద గల బూస్టర్ నుంచి నీటి ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 80 మంది సిబ్బంది పనిచేస్తారు. శాంతి భద్రతలు పరిర క్షించేందుకు పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పుణ్యక్షేత్ర పరిసరాలన్నిటితో పాటు కొండ శిఖరాగ్రం వరకు అన్ని ప్రదేశాలలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పోలీసు బలగాలను మోహరించారు. మూడు రోజులపాటు రాత్రి పగలు సేవలందించే దిశగా పోలీసులు మూడు షిఫ్టుల్లో డ్యూటీ చేయనున్నారు. ఏలూరు రోడ్డు పై భక్తులకు అసౌకర్యం ఏర్పడకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. దాదాపు 1200 మంది పోలీసు సిబ్బంది, అధికారులు విధులు నిర్వహించనున్నారు. పుణ్యక్షేత్రంలోని ప్రధానాలయం, బిషప్‌గ్రాసి ప్రాంగణాలలో ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు.