మేరీమాత ఉత్సవాలకు సర్వం సిద్ధం
విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల పుణ్యక్షేత్రంలో మూడురోజుల పాటు జరిగే మేరీమాత ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు విజయవాడ కథోలిక పీఠం పాలనాధికారి బిషప్ గోవింద్ జోజి, పుణ్యక్షేత్ర గురువులు తొలి సమిష్టి దివ్య బలి పూజ చేయడంతో ఉత్సవాలు మొదలవుతాయి. తిరునాళ్లకు లక్షలాదిగా హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మేరీమాత ఆలయాన్ని రంగు రంగుల తోరణాలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.
ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ప్రధానంగా బిషప్‌గ్రాసి పాఠశాల ఆవరణలో జరిగే సమిష్టి దివ్యబలి పూజ కార్యక్రమాలకు హాజరవుతారు. ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పుణ్యక్షేత్ర పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచే నిమిత్తం కార్పొరేషన్ అధికారులు దాదాపు 150 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. ఆలయ కమిటీ వారు మరో 150 మందిని ఏర్పాటు చేశారు. వీరంత వివిధ షిఫ్టుల్లో 24 గంటల పాటు తమ సేవలందిస్తారు.
బిషప్ గ్రాసి ఆవరణ, ప్రధానాలయం వద్ద దాదాపు 6 ప్రదేశాలలో మంచి నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు.గుణదల వంతెన వద్ద గల బూస్టర్ నుంచి నీటి ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 80 మంది సిబ్బంది పనిచేస్తారు.
శాంతి భద్రతలు పరిర క్షించేందుకు పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పుణ్యక్షేత్ర పరిసరాలన్నిటితో పాటు కొండ శిఖరాగ్రం వరకు అన్ని ప్రదేశాలలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పోలీసు బలగాలను మోహరించారు.
మూడు రోజులపాటు రాత్రి పగలు సేవలందించే దిశగా పోలీసులు మూడు షిఫ్టుల్లో డ్యూటీ చేయనున్నారు. ఏలూరు రోడ్డు పై భక్తులకు అసౌకర్యం ఏర్పడకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. దాదాపు 1200 మంది పోలీసు సిబ్బంది, అధికారులు విధులు నిర్వహించనున్నారు. పుణ్యక్షేత్రంలోని ప్రధానాలయం, బిషప్‌గ్రాసి ప్రాంగణాలలో ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు.