రాజధానికి రెండు గంటల్లో చేరుకోవాలి
- వేగంగా నడిచే రైళ్లు నడపండి
- రైల్వేమంత్రికి సీఎం వినతి
- విజయవాడ-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభం
సాక్షి, విజయవాడ: చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి తక్కువ సమయంలో వచ్చే, అత్యంత వేగంగా నడిచే రైళ్లు కావాలని సీఎం చంద్రబాబు రైల్వేమంత్రి సురేష్ ప్రభును కోరారు. ఆయా నగరాల నుంచి రైళ్లు రెండు గంటల్లో రాజధానికి చేరుకోవాలన్నారు. విజయవాడ- సికింద్రాబాద్ మధ్య కొత్తగా ఏర్పాటుచేసిన సూపర్‌ఫాస్ట్ రైలు 5.30 గంటల్లో కాకుండా నాలుగు గంటల్లోనే గమ్యం చేరుకునేలా వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం విజయవాడలోని రైల్వే ఇనిస్టిట్యూట్ హాలులో విజయవాడ-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభు, సీఎంలు రిమోట్ వీడియో లింకు ద్వారా ప్రారంభించారు. గుంతకల్-కల్లూరు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు, రూ.240 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం వద్ద మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుకు శంకుస్థాపన చేశారు.
3 లాజిస్టిక్ పార్కులు: సురేష్ ప్రభు
రైల్వే మంత్రి మాట్లాడుతూ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్రంలో మూడు లాజిస్టిక్ పార్కులను రూ.1,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇం దులో భాగంగా పొట్టి శ్రీరాములు నెల్లూ రు జిల్లా కృష్ణపట్నం వద్ద మల్టీమోడల్ లాజి స్టిక్ పార్కుకు ఇప్పుడు శంకుస్థాపన చేశామన్నా రు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం, కాకినాడల్లో కూడా ఇదే తరహాలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.
అత్యుత్తమ వ్యవసాయ హబ్‌గా ఏపీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవసాయ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో ఏరువాక పున్నమి కార్యక్రమాన్ని ప్రారంభించారు.