ఆరోగ్యానికి మించిన ఆస్తిలేదు
Published Tue, Sep 3 2013 4:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
కొండపి, న్యూస్‌లైన్ :ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని కలెక్టర్ విజయకుమార్ అన్నారు. మండలంలోని చినవెంకన్నపాలెంలో చాగంటి శ్రీహరి జ్ఞాపకార్థం ఆయన తల్లి కోటమ్మ ఉచితంగా నిర్మించి ఇచ్చిన భవనంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. సెంటు భూమిని సైతం వదులుకోలేని ఈ రోజుల్లో తన సొంత స్థలంలో భవనం నిర్మించి ఆరోగ్య ఉపకేంద్రం కోసం ప్రభుత్వానికి ఇచ్చిన కోటమ్మ నిండు మనసు అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. 16 ఏళ్ల క్రితం కలెక్టర్‌గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట కోసం హెల్త్ సబ్‌సెంటర్ మంజూరుకు కృషి చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. వందశాతం కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు.
గర్భిణుల వివరాలు సేకరించి ముందే వారి ఇళ్లకు వెళ్లి ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నూతన భవనం ప్రారంభానికి సంబంధించిన శిలాఫలకాన్ని కోటమ్మతో కలిసి సీనియర్ ఐఏఎస్ అధికారి డి.శ్రీనివాసులు ఆవిష్కరించి మాట్లాడారు. 16 ఏళ్లనాటి కల నేటికి నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతంతో ఉన్న తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. తాను 1997-98లో కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో చాలా గ్రామాలను సందర్శించానని, గోగినేనిపాలెంలో పర్యటించి ఓ రోడ్డు మంజూరు చేశానని గుర్తుకు తెచ్చారు. ఆరోగ్య ఉపకేంద్రం అపకేంద్రంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు.
డీఎంహెచ్‌ఓ రామతులశమ్మ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో రోజుమార్చి రోజు డాక్టర్ వచ్చి ఓపీలు చూస్తారని చెప్పారు. అదే విధంగా ప్రతి మంగళవారం పంటి డాక్టర్ వచ్చి రోగులకు పరీక్షలు నిర్వహిస్తారని, వారానికి ఒకసారి ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వారు ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. భవన దాత చాగంటి కోటమ్మను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కొండపి ఏఎంసి చైర్మన్ బెల్లం సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ పోటు ఉషారాణి, ఎస్పీహెచ్‌ఓ శ్రీనివాసరావు, డాక్టర్ రాజ్‌విమల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోకూరి కోటయ్య, గొట్టిపాటి మురళీ, మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Advertisement