- కేజీహెచ్‌కు మాస్టర్‌ప్లాన్
- ఒకే గొడుగు నీడలో కీలక వైద్య సేవలు
- ఆర్కిటెక్ట్ సంస్థ నియామకం
- ఆస్పత్రిల్లో ఖాళీ స్థలాల గుర్తింపు
- ఇకపై భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగానే నిర్మాణాలు
- ముందుగా రేడియాలజీ, వైద్య పరీక్షలన్నీ ఒకేచోట ఏర్పాటుకు నిర్ణయం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామారావును కేజీహెచ్ క్యాజువాల్టీకి తీసుకువచ్చారు. అతనికి అత్యవసరంగా రక్తం ఎక్కించాలని క్యాజువాల్టీలో చెప్పారు. దీంతో రక్తం కోసం అన్నీ వెతుక్కుని బ్లడ్‌బ్యాంకుకు పరుగెత్తారు. తీరా అక్కడికి వెళ్తే బ్లడ్ గ్రూప్ కోసం క్లినికల్ ల్యాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకుని క్యాజువాల్టీకి వచ్చేసరికి బాగా టైం పట్టింది. ఈలోగా రామారావు పరిస్థితి మరింత విషమించింది. ఒక్క రామారావే కాదు వివిధ రోగాలతో వచ్చేవారికీ పరీక్షల పేరుతో వివిధ బ్లాకులకు వెళ్లొచ్చేసరికి కాలయాపన జరుగుతోంది. దీనివల్ల రోగి పరిస్థితి క్షీణించడమే కాకుండా అతడి బంధువులకు బోలెడు శ్రమ..ఒత్తిడి ఎదురవుతోంది.
ఇకమీదట ఇలాంటి అవస్థలకు తెరదించాలని ప్రభుత్వ యంత్రాంగం సంకల్పించింది. కేజీహెచ్‌లో కీలక సేవలన్నీ ఒకే చోట అందించాలని ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి అంగీకారం లభించింది. ఆర్కిటెక్ట్ సంస్థ నియామకం కూడా పూర్తయింది.
ప్రస్తుతం అన్ని సదుపాయాలున్నా.. ల్యాబొరేటరీల నుంచి వైద్య విభాగాలు వరకు అన్నీ గందరగోళంగా ఉన్నాయి. అత్యవసర వైద్య విభాగాలు ఒకచోట, వైద్య పరీక్షలు మరోచోట, బ్లడ్‌బ్యాంక్ ఇంకోచోట.. ఇలా వైద్యం కోసం కేజీహెచ్‌కు వస్తే ఒక్కోదానికి ఒక్కో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర వైద్యం కోసం క్యాజువాల్టీకి వచ్చిన వారు వీటి చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం పడుతుంది. అత్యవసర వైద్యసేవలన్నింటినీ ఒకే చోటుకు తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
క్యాజువాల్టీ, బ్లడ్‌బ్యాంక్, రేడియాలజీ, ఐసీయూ, 24 గంటల ల్యాబొరేటరీ ఇలా ప్రధానమైన వన్నింటినీ ఒకే బిల్డింగ్‌లో ఏర్పాటు చేయాల్సిన అవసరముందని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వైద్యులకు సూచించారు. ఆ దిశగా ప్రతిపాదనలను వేగవంతం చేస్తున్నారు. గైనకాలజీవార్డు ఎదురుగా ఉన్న మెడ్‌ఆల్ డయాగ్నస్టిక్స్ సెంటర్ భవనంపైన అదనపు అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఇందులో ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని ముందు భావించినప్పటికీ కొత్త ప్రతిపాదనల దృష్ట్యా అన్ని రకాల స్కాన్లు, రేడియాలజీ, ఇతర వైద్య పరీక్షా విభాగాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే కేజీహెచ్‌లో ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, శిథిలావస్థకు వచ్చిన భవనాలు, ఇతరత్రా వాటిపై ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు.