in a road accident
-
రోడ్డు ప్రమాదమా.. హత్యాయత్నమా?
గాయపడ్డ ముగ్గురు ‘ఎర్ర’ దొంగలు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : అనంతపురం శివారులో ఆదివారం వేకువజామున జరిగిన ఎర్రచందనం దొంగల ముఠా సభ్యుల రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారా.. లేక ఎర్రచందనం దుంగలను రహస్యంగా తరలించి సొమ్ము చేసుకుంటుంటే పసిగట్టి ముఠా నేతలే వాహనంలో వెంబడించి ఏమైనా హత్య చేయడానికి ప్రయత్నించారా అన్నది అంతుచిక్కడం లేదు. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన నారాయణ అలియాస్ అగస్టీన్, ఇదే మండలం దొరికొట్టాలకు చెందిన రాజు, కర్ణాటకవాసి సోహైల్ శనివారం రాత్రి శ్రీశైలం అడవుల నుంచి తొమ్మిది ఎర్రచందనం దుంగలతో కేఏ05 ఎంపీ 2855 నంబరుగల క్వాలీస్ వాహనంలో బెంగళూరుకు బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి సమీపాన 44వ నంబరు జాతీయరహదారి వంతెనపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురూ లేవలేని స్థితిలో ఉన్నా పోలీసుల కంటపడకూడదని తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే స్థానికులు అక్కడకు చేరుకుని మానవతా దృక్పథంతో వారిని సర్వజనాస్పత్రికి చేర్చారు. అగస్టిన్, రాజు అపస్మారకస్థితికి చేరుకున్నారు. సోహైల్ మాత్రం స్పృహలో ఉన్నాడు. రోడ్డు ప్రమాదంపై అవుట్‌పోస్ట్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఉదయం పదిన్నర గంటల సమయంలో సంఘటన స్థలానికెళ్లారు. నుజ్జునుజ్జయిన క్వాలీస్ వాహనాన్ని తనిఖీ చేయగా.. సీటు కింద 9 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సర్వజనాస్పత్రిలో ఆ ముగ్గురు ఎర్రచందనం దొంగల ముఠా సభ్యులకు ఎస్కార్టను నియమించారు. ఈ ముఠా వివరాలను తెలుసుకునేందుకు.. ఇంకా ఎక్కడెక్కడ దుంగలను నిల్వ చేశారో తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. ఆ దుంగలు.. అటవీశాఖ కార్యాలయంలోనివంటూ పుకార్లు అనంతపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలను ఆధివారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. ఈ విషయంపై అటవీశాఖాధికారులు తర్జన భర్జనలో ఉండగానే...రోడ్డు ప్రమాదంలో ఎర్ర చందనం దొంగలు గాయపడి పోలీసులకు చిక్కారు. వీరి వాహనంలో లభించిన దుంగలు అటవీశాఖ కార్యాలయంలో అపహరణకు గురైనవీ ఒక్కటేనేమోనని పుకార్లు షికార్లు చేశాయి. చివరకు ఆ దుంగలు అటవీశాఖవి కాదని నిర్ధారణైంది. దీంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కొడుకును బతికించుకోవాలని..
గాయపడ్డ ఓ తండ్రి ఆరాటం టైరు పేలడంతో కారు బోల్తా తండ్రీ కుమారులకు గాయాలు రోడ్డు ప్రమాదంలో తనతో పాటు తీవ్రంగా గాయపడిన కొడుకును రక్షించుకునేందుకు ఆ తండ్రి పడిన క్షోభ అంతులేనిది. ఒక పక్క తనకు తగిలిన గాయాలు బాధిస్తున్నా అపస్మారక స్థితిలో ఉన్న తనయుడిని కాపాడుకునేందుకు హైవే పోలీసులు, జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారుల కాళ్లావేళ్లా పడినా ప్రయోజనం లేకపోయింది. చివరకు స్థానికుల చొరవతో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి విశాఖలోని కేర్ ఆస్పత్రికి క్షతగాత్రుణ్ణి తరలించారు. యలమంచిలి/యలమంచిలి రూరల్ న్యూస్ లైన్ : యలమంచిలి మండలం, మర్రిబంద సమీపంలో హోటల్ వద్ద సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో టైరు పేలడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తండ్రీ కుమారులు గాయపడ్డారు. విశాఖకు చెందిన బి.వీరన్న తన కుమారుడు సాయితేజ తో కలిసి పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల నుంచి విశాఖ వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో సాయితేజ తీవ్రంగా గాయపడ్డాడు. వీరన్నకు స్వల్పగాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని స్థానికుల సాయంతో రోడ్డువరకు తీసుకువచ్చిన వీరన్న తీవ్ర వేదనకు లోనయ్యారు. సంఘటన స్థలం వద్ద ఉన్న హైవే పోలీసులను త్వరగా ఆస్పత్రిలో చేర్చాలని ప్రాథేయపడుతూనే మరోపక్క జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను కూడా నిలిపే ప్రయత్నం చేశారు. సాయితేజ కొన ఊపిరితో ఉన్నాడన్న కారణంగా హైవే పోలీసులు ఆస్పత్రికి తీసుకు వెళ్లడానికి వెనుకాడారు. స్థానికులు కూడా బతిమాలడంతో అర్ధగంట తర్వాత యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమచికిత్స చేసి విశాఖ తరలించాలని వైద్యులు సూచించడంతో వాహనం కోసం వీరన్న పడిన యాతన అంతా ఇంతాకాదు. రోగులను, స్థానికులను నా కుమారుడిని రక్షించుకోవడానికి వాహనాన్ని ఏర్పాటు చేయాలని ప్రాధేయపడ్డారు. ప్రమాదానికి సం బంధించిన పత్రాలు ఇవ్వాలంటూ వైద్య సిబ్బందిని వేడుకున్నారు. వాహనం లేకపోవడంతో సమీపంలోని ట్రావెల్స్ వద్దకు పరుగులు తీశారు. కార్లు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఏర్పాటు చేసిన వాహనంలో కుమారుడిని విశాఖలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వీరన్న విశాఖలోని ఎంవీపీ కాలనీలో బియ్యం వ్యాపారం చేస్తుండగా కుమారుడు సాయితేజ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో సాయితేజ చికిత్స పొందుతున్నాడని యలమంచిలి టౌన్ ఎస్ఐ నల్లి రవికుమార్ తెలిపారు. -
జాతీయ రహదారి రక్తసిక్తం
తమిళనాడులోని హొసూరు-సూళగిరి మధ్య రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి దుర్మరణం మృతుల్లో వేలూరు జిల్లా ఎస్ఐ నిలిపి ఉన్న లారీని ఢీకొన్న కార్లు హొసూరు, న్యూస్‌లైన్ : ఏడవ నంబర్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో వేలూరు జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్న ఆనందన్ (50)తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వివరాలు... వేలూరు జిల్లా సత్వచేరి గ్రామానికి చెందిన ఆన ందన్.. పాగాయంలో ఎస్.ఐగా పనిచేస్తున్నారు. ఇతనని సోదరుడు బాబు (46) బెంగళూరులో వ్యాపారి. శనివారం ఆనందన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బాబు కుటుంబ సభ్యులు వేలూరు నుంచి రెండు కార్లలో శనివారం అర్ధరాత్రి బెంగళూరు బయలుదేరారు. కాశ్మీర్-క న్యాకుమారి ఏడవ నంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో హొసూరు-సూళగిరి మధ్యలో గోపనపల్లి వద్ద రోడ్డుపై చెడిపోయి నిలిపి ఉన్న లారీని వేగంగా వస్తున్న కార్లు బలంగా ఢీకొన్నాయి. వెనుకనే వస్తున్న మరో రెండు కార్లు కూడా అదుపు తప్పి ఢీకొన్నాయి. దీంతో మొదటి రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 12 మందిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఎస్.ఐ ఆనంద్ (50) ఆయన భార్య ఉమ (48), కూతురు సంధ్య (13), ఎస్.ఐ సోదరుడు బాబు (46), భార్య రమణి (40), కుమారుడు అరుణ్ (10), కారు డ్రైవర్ విల్లు (35) అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో కారు డ్రైవర్ మురుగన్, షాలినీ (20), సీత (7), ఐశ్వర్య (15), దివాకర్ (4) తీవ్రంగా గాయపడ్డారు. వీరికి హొసూరు ప్రభుత్వలో ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని హొసూరు వైద్యులు వెల్లడించారు. కాగా, అర్ధరాత్రి క్షతగాత్రుల అరుపులు, కేకలతో జాతీయ రహదారి దద్దరిల్లింది. ప్రమాద సమాచారం అందుకున్న హొసూరు డీఎస్పీ గోపి, సిప్కాట్, సూళగిరి సీఐలు శంకర్, సుభాష్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఇదిలా ఉంటే మూడో కారులో ప్రయాణిస్తున్న రాజస్తాన్‌కు చెందిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గంటసేపు శ్రమించిన అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కణ్ణమ్మాళ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఇద్దరు పీయూసీ విద్యార్థుల దుర్మరణం
ప్రాణాలు తీసిన వేగం బైక్‌పై పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ప్రమాదం శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మాన్వి, న్యూస్‌లైన్ : ద్వితీయ పీయూసీ పరీక్ష రాసేందుకు మాన్వికి వెళుతున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతులను తాలూకాలోని హిరేకొట్నేకల్కు చెందిన అజీం(18), యాపలపర్వికి చెందిన యల్లప్ప(18)గా గుర్తించారు. వీరు ఇక్కడకు సమీపంలోని నసలాపుర క్రాస్ వద్ద రాష్ట్ర రహదారిలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతుండగా, మలుపులో వంతెన వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. పోత్నాళలోని మహర్షి వాల్మీకి పీయూ కాలేజీలో చదువుతున్న వీరికి మాన్విలోని బాలికల ప్రభుత్వ పీయూ కాలేజీని పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పరీక్ష ప్రారంభమయ్యేలోపు కేంద్రానికి చేరుకోవాలనే ఆత్రుతలో వేగంగా బైక్‌పై వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సీఐ హరీష్, ఎస్ఐ దీపక్ బూసరెడ్డి తమ సిబ్బంది తో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మహర్షి కాలేజీ పాలక మండలి, విద్యార్థుల స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
ఓ మెడికల్ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయూలు ఆగి ఉన్న లారీని కారుఢీకొనడంతో ప్రమాదం మరో ఇద్దరికి స్వల్ప గాయాలు బాధితులంతా వైద్య విద్యార్థులే మడికొండ/ఎంజీఎం, న్యూస్‌లైన్ : సరదాగా ఐదుగురు మెడికల్ విద్యార్థులు కలిసి విహారానికి బయల్దేరగా వారి ప్రయూణం విషాదంతమైంది. ఆగి ఉన్న లారీని ఢీకొని ఓ మెడికల్ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ నగర శివారు మడికొండ పెట్రోల్‌పంప్ వద్ద సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, క్షతగాత్రుల కథనం ప్రకారం... వరంగల్ కాశిబుగ్గకు చెందిన వైద్యులు డాక్టర్ టి.భాస్కర్, శోభారాణి దంపతుల కుమార్తె చైతన్యశ్రీ(24), ఎంజీఎం యూరాలజిస్టు డాక్టర్ సురేందర్ కుమార్తె పూజిత, జనగామ వ్యాపారవేత్త నర్సింహారెడ్డి కుమార్తె సుష్మ, దుబాయ్‌కి చెందిన నజియా కరీంనగర్ జిల్లా ప్రతిమ మెడికల్ కళాశాలలో హౌస్‌సర్జన్ నాలుగో సంవత్సరం పూర్తి చేశారు. వీరంతా ఆదివారం వరంగల్ కేఎంసీ, నిట్‌లో నిర్వహించిన మెడికల్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం అంతా కలిసి హన్మకొండ హంటర్‌రోడ్డులోని వనవిజ్ఞాన కేంద్రం(జూ పార్కు)కు వెళ్లారు. అరుుతే జూ పార్క్ మూసి ఉండడంతో హైదరాబాద్‌కు వెళ్దామని బయల్దేరారు. కారు మడికొండలోని పెట్రోల్‌పంప్ సమీపంలోకి రాగానే డ్రైవింగ్ చేస్తున్న చైతన్యశ్రీ తమ్ముడు ఉదయ్‌రాజ్ షూ క్లచ్, గేర్ మధ్య ఇరుక్కుంది. దీంతో కాలిని పైకి తీసే క్రమంలో కారు అదుపుతప్పి అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో చైతన్యశ్రీ అక్కడి కక్కడే కారులో మృతిచెందగా పూజిత, నజియా తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మృతురాలు చైతన్యశ్రీ ఎడమ చేయి పూర్తిగా తెగి దూరంగా పడిపోయింది. మడికొండ సీఐ నందిరాంనాయక్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో, ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి పంపించారు. ప్రమాద స్థలాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంత రాయం ఏర్పడడంలో పోలీసులు వన్‌వేలో వాహనాలను పంపించారు. స్వల్పగాయాలైన సుష్మ, హృదయ్‌రాజ్ నుంచి సీఐ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమచారమిచ్చారు. అతివేగమే ప్రమాదానికి కారణమా.. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనం వెనుకాలే వస్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఆగిపోయారు. ప్రమాద సమయంలో కారు వేగం 120 స్పీడ్‌తో ఉన్నట్లు తెలుస్తోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయ్‌రాజ్ కాకతీయ మెడికల్ కళాశాలలో(కేఎంసీ)లో సెకండయరీ చేస్తున్నాడు. బాధితులను డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తోపాటు పెద్దఎత్తున వైద్యులు తరలివచ్చి పరామర్శించారు. -
పెళ్లికెళ్తుండగా ప్రమాదం
గదగ్(బళ్లారి), న్యూస్‌లైన్ : రహదారి నెత్తరోడింది. వరుడితో కలిసి ఆనందోత్సాహాల మధ్య వివాహానికి బయల్దేరిన వారిలో కొంతమందిని దారి మధ్యలోనే వృుత్యువు కబలించింది. మరికొందరిని క్షతగాత్రులగా మార్చింది. గదగ్ జిల్లా ముండరగి తాలూకా డంబళ్ గ్రామ శివార్లలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పెళ్లి కుమారుడితో సహా 20 మంది గాయపడ్డారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు... బళ్లారి జిల్లా హడగలి తాలూకా కందగల్లపుర గ్రామంలో బుధవారం సామూహిక వివాహాలు తలపెట్టారు. డంబళ్ గ్రామానికి చెందిన పెళ్లికుమారుడు నీలకంఠ , మల్లమ్మ సామూహిక వివాహాల్లో ఒక్కటయ్యేందుకు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఈ మేరకు పెళ్లి కుమారుడు, అతని సమీప బంధువులు బుధవారం ఉదయం ట్రాక్టర్లో వివాహ వేదిక వద్దకు బయల్దేరారు వాహనం గ్రామ శివార్లు దాటి డంబళ-మేవుండి జాతీయ రహదారిపైకి చేరగానే గదగ్ వైపు నుంచి వచ్చిన లారీ ఆ ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి వేగంగా ఢీకొంది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారందరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. రోణ తాలూకా అబ్బిగేరి గ్రామానికి చెందిన ప్రశాంత్ కెంగార్(6), సజ్జన్ కెంగార్(2), హడగలి తాలూకా మాగళ గ్రామానికి చెందిన సంజన సంకమ్మనవర్, సుదీప్(6), గదగ్ జిల్లా నాగసముద్ర గ్రామానికి చెందిన రేణుకా(26), ముత్తప్ప(30), రేణుకా(22), కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా మంగళూరు గ్రామానికి చెందిన హనుమంతప్ప పూజార్(35), అన్నపూర్ణ(35), మరొక గుర్తు తెలియని బాలుడు ఘటనా స్థలంలోనే మరణించారు. గాయపడిన 20 మందిని డంబళ్ ఆస్పత్రి, గదగ్ జిల్లా ఆస్పత్రి, హుబ్లీ కిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరగ్గానే లారీ డ్రైవర్, క్లీనర్ ఉడాయించారు. శిరహట్టి ఎమ్మెల్యే రామకృష్ణ దొడ్డమని, రోణ ఎమ్మెల్యే బీఎస్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు చికిత్స వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని, వృుతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పరిహార నిధి నుంచి తగిన పరిహారం అందించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఎస్డీ శరణప్ప, జిల్లాధికారి ఎన్ఎస్ ప్రసన్నకుమార్ తదితరులు పరిశీలించారు. లారీని వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనపై ముండరగి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఆరోగ్య ఛత్రం
కేజీహెచ్‌కు మాస్టర్‌ప్లాన్ ఒకే గొడుగు నీడలో కీలక వైద్య సేవలు ఆర్కిటెక్ట్ సంస్థ నియామకం ఆస్పత్రిల్లో ఖాళీ స్థలాల గుర్తింపు ఇకపై భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగానే నిర్మాణాలు ముందుగా రేడియాలజీ, వైద్య పరీక్షలన్నీ ఒకేచోట ఏర్పాటుకు నిర్ణయం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామారావును కేజీహెచ్ క్యాజువాల్టీకి తీసుకువచ్చారు. అతనికి అత్యవసరంగా రక్తం ఎక్కించాలని క్యాజువాల్టీలో చెప్పారు. దీంతో రక్తం కోసం అన్నీ వెతుక్కుని బ్లడ్‌బ్యాంకుకు పరుగెత్తారు. తీరా అక్కడికి వెళ్తే బ్లడ్ గ్రూప్ కోసం క్లినికల్ ల్యాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకుని క్యాజువాల్టీకి వచ్చేసరికి బాగా టైం పట్టింది. ఈలోగా రామారావు పరిస్థితి మరింత విషమించింది. ఒక్క రామారావే కాదు వివిధ రోగాలతో వచ్చేవారికీ పరీక్షల పేరుతో వివిధ బ్లాకులకు వెళ్లొచ్చేసరికి కాలయాపన జరుగుతోంది. దీనివల్ల రోగి పరిస్థితి క్షీణించడమే కాకుండా అతడి బంధువులకు బోలెడు శ్రమ..ఒత్తిడి ఎదురవుతోంది. ఇకమీదట ఇలాంటి అవస్థలకు తెరదించాలని ప్రభుత్వ యంత్రాంగం సంకల్పించింది. కేజీహెచ్‌లో కీలక సేవలన్నీ ఒకే చోట అందించాలని ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి అంగీకారం లభించింది. ఆర్కిటెక్ట్ సంస్థ నియామకం కూడా పూర్తయింది. ప్రస్తుతం అన్ని సదుపాయాలున్నా.. ల్యాబొరేటరీల నుంచి వైద్య విభాగాలు వరకు అన్నీ గందరగోళంగా ఉన్నాయి. అత్యవసర వైద్య విభాగాలు ఒకచోట, వైద్య పరీక్షలు మరోచోట, బ్లడ్‌బ్యాంక్ ఇంకోచోట.. ఇలా వైద్యం కోసం కేజీహెచ్‌కు వస్తే ఒక్కోదానికి ఒక్కో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర వైద్యం కోసం క్యాజువాల్టీకి వచ్చిన వారు వీటి చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం పడుతుంది. అత్యవసర వైద్యసేవలన్నింటినీ ఒకే చోటుకు తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. క్యాజువాల్టీ, బ్లడ్‌బ్యాంక్, రేడియాలజీ, ఐసీయూ, 24 గంటల ల్యాబొరేటరీ ఇలా ప్రధానమైన వన్నింటినీ ఒకే బిల్డింగ్‌లో ఏర్పాటు చేయాల్సిన అవసరముందని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వైద్యులకు సూచించారు. ఆ దిశగా ప్రతిపాదనలను వేగవంతం చేస్తున్నారు. గైనకాలజీవార్డు ఎదురుగా ఉన్న మెడ్‌ఆల్ డయాగ్నస్టిక్స్ సెంటర్ భవనంపైన అదనపు అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందులో ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని ముందు భావించినప్పటికీ కొత్త ప్రతిపాదనల దృష్ట్యా అన్ని రకాల స్కాన్లు, రేడియాలజీ, ఇతర వైద్య పరీక్షా విభాగాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే కేజీహెచ్‌లో ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, శిథిలావస్థకు వచ్చిన భవనాలు, ఇతరత్రా వాటిపై ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. -
అయ్యప్ప భక్తులకు కన్నీటి వీడ్కోలు
=దిక్కెవరంటూ కన్నీటి పర్యంతమైన రెడ్డిప్రసాద్ తల్లి =సొమ్మసిల్లిన చండ్రాయుడు భార్య =సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: తమిళనాడులోని పళణి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అయ్య ప్ప భక్తులకు బసినికొండ, రామాచార్లపల్లెలో కుటుంబ సభ్యులు, బంధువు లు, స్థానికులు కన్నీటి వీడ్కోలు పలికారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వారిలో చండ్రాయుడు, రెడ్డిప్రసాద్ మృతదేహాలు గ్రామానికి వచ్చాయి. పెద్దరెడ్డెప్ప మృతదేహం రావాల్సి ఉంది. చండ్రానాయుడు, రెడ్డిప్రసాద్ మృతదేహా లకు గురువారం సాంప్రదాయ బద్ధం గా అంత్యక్రియలు నిర్వహించారు. ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ సహాయం చేసే మంచి వ్యక్తి చండ్రాయుడని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎంత రాత్రిలో పిలిచినా పలికే చండ్రాయుడు ఇక లేడన్న వార్త రామాచర్లపల్లె ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. భవనకార్మికుడిగా ఉంటూ ఎంతోమందికి ఉపాధి చూపిన ఆయన మరణవార్త విని కార్మికులు చలించిపోయారు. చండ్రాయుడు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కిరణ్‌కుమార్, భార్య లక్ష్మీదేవిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. భర్త మృతదేహం వద్దే లక్ష్మిదేవి సొమ్మసిల్లి పడిపోయింది. ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా తదితరులు చండ్రాయుడు భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం ప్రకటిం చారు. ప్రభుత్వం నుంచి సాయం త్వరగా అందేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు. మాకు దిక్కెవరు నాయనా: ‘అష్టకష్టాలు పడి, అప్పులు చేసి చదివించామే. నీవేమో ఇంత అన్యా యం చేసి మాకు దక్కకుండా పోయా వే ఇక మాకు దిక్కెవరు నాయనా’ అంటూ రెడ్డిప్రసాద్ తల్లి రోదించడం అందరినీ కలచివేసింది. బీటెక్ చదివి చెట్టంత ఎదిగిన కొడుకును దేవుడు ఇంత అర్ధాంతంగా ఎందుకు తీసు కెళ్లిపోయాడంటూ బంధువులు, స్థాని కులు కన్నీటి పర్యంతమయ్యారు. అన్న కోసం చెల్లెలు దీప వెక్కివెక్కి రోదించడం, అమ్మను ఓదార్చలేక పోవడం చూపరులను కంటతడిపెట్టించింది. రెడ్డి ప్రసాద్ అంతిమ సంస్కారాలకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరై తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రెడ్డిప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలియజేశారు. నిరీక్షణ పెద్దరెడ్డెప్ప మృతదేహం గురువారం రాత్రికీ గ్రామానికి చేరుకోలేదు. పోస్టుమార్టం కాకపోవడంతో ఆస్పత్రిలోనే మృతదేహం ఉందని గ్రామస్తులు తెలియజేశారు. రెడ్డెప్ప మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు నిరీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడిన పురుషోత్తం(44) పరిస్థితి విషమంగా ఉండడంతో మరో చేదువార్త వినాల్సి వస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.