- ప్రాణాలు తీసిన వేగం
- బైక్‌పై పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ప్రమాదం
- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు
మాన్వి, న్యూస్‌లైన్ : ద్వితీయ పీయూసీ పరీక్ష రాసేందుకు మాన్వికి వెళుతున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతులను తాలూకాలోని హిరేకొట్నేకల్‌కు చెందిన అజీం(18), యాపలపర్వికి చెందిన యల్లప్ప(18)గా గుర్తించారు. వీరు ఇక్కడకు సమీపంలోని నసలాపుర క్రాస్ వద్ద రాష్ట్ర రహదారిలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతుండగా, మలుపులో వంతెన వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. పోత్నాళలోని మహర్షి వాల్మీకి పీయూ కాలేజీలో చదువుతున్న వీరికి మాన్విలోని బాలికల ప్రభుత్వ పీయూ కాలేజీని పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పరీక్ష ప్రారంభమయ్యేలోపు కేంద్రానికి చేరుకోవాలనే ఆత్రుతలో వేగంగా బైక్‌పై వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే సీఐ హరీష్, ఎస్‌ఐ దీపక్ బూసరెడ్డి తమ సిబ్బంది తో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మహర్షి కాలేజీ పాలక మండలి, విద్యార్థుల స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.