రహదారి నెత్తరోడింది. వరుడితో కలిసి ఆనందోత్సాహాల మధ్య వివాహానికి బయల్దేరిన వారిలో కొంతమందిని దారి మధ్యలోనే వృుత్యువు కబలించింది.
గదగ్(బళ్లారి), న్యూస్‌లైన్ : రహదారి నెత్తరోడింది. వరుడితో కలిసి ఆనందోత్సాహాల మధ్య వివాహానికి బయల్దేరిన వారిలో కొంతమందిని దారి మధ్యలోనే వృుత్యువు కబలించింది. మరికొందరిని క్షతగాత్రులగా మార్చింది. గదగ్ జిల్లా ముండరగి తాలూకా డంబళ్ గ్రామ శివార్లలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పెళ్లి కుమారుడితో సహా 20 మంది గాయపడ్డారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు... బళ్లారి జిల్లా హడగలి తాలూకా కందగల్లపుర గ్రామంలో బుధవారం సామూహిక వివాహాలు తలపెట్టారు.
డంబళ్ గ్రామానికి చెందిన పెళ్లికుమారుడు నీలకంఠ , మల్లమ్మ సామూహిక వివాహాల్లో ఒక్కటయ్యేందుకు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఈ మేరకు పెళ్లి కుమారుడు, అతని సమీప బంధువులు బుధవారం ఉదయం ట్రాక్టర్‌లో వివాహ వేదిక వద్దకు బయల్దేరారు వాహనం గ్రామ శివార్లు దాటి డంబళ-మేవుండి జాతీయ రహదారిపైకి చేరగానే గదగ్ వైపు నుంచి వచ్చిన లారీ ఆ ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి వేగంగా ఢీకొంది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారందరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు.
రోణ తాలూకా అబ్బిగేరి గ్రామానికి చెందిన ప్రశాంత్ కెంగార్(6), సజ్జన్ కెంగార్(2), హడగలి తాలూకా మాగళ గ్రామానికి చెందిన సంజన సంకమ్మనవర్, సుదీప్(6), గదగ్ జిల్లా నాగసముద్ర గ్రామానికి చెందిన రేణుకా(26), ముత్తప్ప(30), రేణుకా(22), కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా మంగళూరు గ్రామానికి చెందిన హనుమంతప్ప పూజార్(35), అన్నపూర్ణ(35), మరొక గుర్తు తెలియని బాలుడు ఘటనా స్థలంలోనే మరణించారు. గాయపడిన 20 మందిని డంబళ్ ఆస్పత్రి, గదగ్ జిల్లా ఆస్పత్రి, హుబ్లీ కిమ్స్ ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాదం జరగ్గానే లారీ డ్రైవర్, క్లీనర్ ఉడాయించారు. శిరహట్టి ఎమ్మెల్యే రామకృష్ణ దొడ్డమని, రోణ ఎమ్మెల్యే బీఎస్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు చికిత్స వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని, వృుతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పరిహార నిధి నుంచి తగిన పరిహారం అందించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఎస్‌డీ శరణప్ప, జిల్లాధికారి ఎన్‌ఎస్ ప్రసన్నకుమార్ తదితరులు పరిశీలించారు. లారీని వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనపై ముండరగి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.