కొడుకును బతికించుకోవాలని..
- గాయపడ్డ ఓ తండ్రి ఆరాటం
- టైరు పేలడంతో కారు బోల్తా
- తండ్రీ కుమారులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో తనతో పాటు తీవ్రంగా గాయపడిన కొడుకును రక్షించుకునేందుకు ఆ తండ్రి పడిన క్షోభ అంతులేనిది. ఒక పక్క తనకు తగిలిన గాయాలు బాధిస్తున్నా అపస్మారక స్థితిలో ఉన్న తనయుడిని కాపాడుకునేందుకు హైవే పోలీసులు, జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారుల కాళ్లావేళ్లా పడినా ప్రయోజనం లేకపోయింది. చివరకు స్థానికుల చొరవతో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి విశాఖలోని కేర్ ఆస్పత్రికి క్షతగాత్రుణ్ణి తరలించారు.
యలమంచిలి/యలమంచిలి రూరల్ న్యూస్ లైన్ : యలమంచిలి మండలం, మర్రిబంద సమీపంలో హోటల్ వద్ద సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో టైరు పేలడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తండ్రీ కుమారులు గాయపడ్డారు. విశాఖకు చెందిన బి.వీరన్న తన కుమారుడు సాయితేజ తో కలిసి పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల నుంచి విశాఖ వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో సాయితేజ తీవ్రంగా గాయపడ్డాడు. వీరన్నకు స్వల్పగాయాలయ్యాయి.
అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని స్థానికుల సాయంతో రోడ్డువరకు తీసుకువచ్చిన వీరన్న తీవ్ర వేదనకు లోనయ్యారు. సంఘటన స్థలం వద్ద ఉన్న హైవే పోలీసులను త్వరగా ఆస్పత్రిలో చేర్చాలని ప్రాథేయపడుతూనే మరోపక్క జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను కూడా నిలిపే ప్రయత్నం చేశారు. సాయితేజ కొన ఊపిరితో ఉన్నాడన్న కారణంగా హైవే పోలీసులు ఆస్పత్రికి తీసుకు వెళ్లడానికి వెనుకాడారు. స్థానికులు కూడా బతిమాలడంతో అర్ధగంట తర్వాత యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రథమచికిత్స చేసి విశాఖ తరలించాలని వైద్యులు సూచించడంతో వాహనం కోసం వీరన్న పడిన యాతన అంతా ఇంతాకాదు. రోగులను, స్థానికులను నా కుమారుడిని రక్షించుకోవడానికి వాహనాన్ని ఏర్పాటు చేయాలని ప్రాధేయపడ్డారు. ప్రమాదానికి సం బంధించిన పత్రాలు ఇవ్వాలంటూ వైద్య సిబ్బందిని వేడుకున్నారు.
వాహనం లేకపోవడంతో సమీపంలోని ట్రావెల్స్ వద్దకు పరుగులు తీశారు. కార్లు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఏర్పాటు చేసిన వాహనంలో కుమారుడిని విశాఖలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వీరన్న విశాఖలోని ఎంవీపీ కాలనీలో బియ్యం వ్యాపారం చేస్తుండగా కుమారుడు సాయితేజ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో సాయితేజ చికిత్స పొందుతున్నాడని యలమంచిలి టౌన్ ఎస్‌ఐ నల్లి రవికుమార్ తెలిపారు.