యోగాతో ఆరోగ్యవంతమైన సమాజం
మనిషి మనిషిగా బతకాలంటే యోగా ద్వారానే సాధ్యం: చంద్రబాబు
విజయవాడ స్పోర్ట్స్: యోగా ప్రాచీన భారతీయ వారసత్వ సంపదని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులు, యోగా గురువులతో కలిసి సురేష్ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు యోగాసనాలు వేశారు. సురేష్ ప్రభు మాట్లాడుతూ... యోగాతో ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుందన్నారు.
యోగా ఆత్మను, అంతరాత్మను కలుపుతుంద ని చంద్రబాబు చెప్పారు. మన వారసత్వ సంపద యోగాను ప్రపంచమంతా ఆచరిస్తోందన్నారు. యోగా ను శాస్త్రీయంగా సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని వెల్లడించారు. మనిషి మనిషిగా బతకాలంటే యోగా ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు యోగా గురువులను సీఎం సన్మానించారు.