- పంచాయతీ భవనాలకు లభించని ఆమోదం
- నెలలు గడుస్తున్నా నిధులివ్వని ప్రభుత్వం
- సిబ్బంది కొరతతో దయనీయ పరిస్థితి
- ఆర్‌జీపీఎస్‌ఏ అమలుపై నీలినీడలు
విశాఖ రూరల్ : పంచాయతీలకు సొంత గూడు కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. శాశ్వత భవనాల నిర్మాణానికి ఆమోదం లభించి నెలలు గడుస్తున్నా.. ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. అసలు నిధులు ఏ విధంగా కేటాయిస్తారు.. పనులు ఎవరు చేపడతారన్నదానిపై స్పష్టత లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కేంద్రం, రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరడంతో పాత పథకాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
లోటుబడ్జెట్‌తో సతమతమవుతున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆశించినమేర సాయం అందే అవకాశాలు కనిపించడం లేదు. రాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తికరణ్ అభియాన్(ఆర్‌జీపీఎస్‌ఏ) పథకం కింద పంచాయతీలకు సొగసులు అద్దుతామని గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీ కార్యాలయాల ఏర్పాటు, అవసరమైన సిబ్బంది కల్పన, గ్రామ సభలకు సంబంధించి నిపుణుల బృందంతో అవగాహ న వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు 25 పంచాయతీ కార్యాలయాలకు శాశ్వత భవనాలను మంజూరు చేసింది. ఒక్కోదానికి రూ.12 లక్షలు కేటాయించింది.
నెలలు గడుస్తున్నా నిర్మాణాలు లేవు
పక్కా భవనాల నిర్మాణాలకు అధికారులు భూములను సైతం గుర్తించారు. ఆమేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. అవి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి, నిధులు ఏ విధంగా మంజూరు చేస్తారన్న విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే పంచాయతీ శాఖ ద్వారా చేపట్టే కొన్ని పనుల కోసం ఇతర ఇంజినీరింగ్ శాఖలపై ఆధారపడకుండా 3, 4 పంచాయతీలకు కలిపి ఒక డీఈ, ఏఈ స్థాయి టెక్నికల్ సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులను పూర్తి స్థాయిలో నియమించకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది.
టెక్నికల్ సిబ్బంది నియామకం జరిగే అవకాశం కూడా లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ పంచాయతీ కార్యాలయాల నిర్మాణాల విషయమై ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించగా.. ఒక్కో కార్యాలయానికి రూ.12 లక్షలు చాలవని ఇంజినీరింగ్ అధికారులు తేల్చి చెప్పారు. ఎంత అవసరం, ప్రతిపాదనలు ఎవరు చేస్తారన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో ఈ అంశాన్ని పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. నిర్మాణాలకు గుర్తించిన స్థలాలను ఇతర అవసరాలకు కేటాయిస్తారేమోనని పంచాయతీ అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.