ఓటర్లలో భారీగా బోగస్ ‘బాబు’లు
రాజధానిలోనూలోనూ, సీమాంధ్రలోనూ ఓటేశారు: గొట్టిముక్కల
రెండుచోట్లా టీడీపీకే ఓట్లేశారని ఆరోపిస్తున్న టీఆర్‌ఎస్ నేత
హైదరాబాద్: ‘‘హైదరాబాద్ గ్రేటర్ నియోజకవర్గాల్లో 14 లక్షల దాకా బోగస్ ఓట్లు నమోదయ్యాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వీరిలో అత్యధికులు ఇటు హైదరాబాద్‌లోనూ, అటు సీమాంధ్రలోని తమ స్వస్థలాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏప్రిల్ 30న నగరంలో, మే7న ఆంధ్ర జిల్లాలకు తరలి వెళ్లి ఓటేశారు. ఈ బోగస్ ఓట్ల తతంగానికి వ్యూహాకర్త టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబేనన్న ప్రాథమిక సమాచారం లభించింది. ఆయన కనుసన్నల్లోనే ఆన్‌లైన్ ద్వారా లక్షలాది మందికి డూప్లికేట్ ఓట్లను నమోదు చేశారు. ఆంధ్ర జిల్లాలకు చెందిన రెండున్నర లక్షల మంది ఎన్నికలకు ముందు మూడు నెలల్లో హైదరాబాద్ శివారు నియోజకవర్గాల్లో ఆన్‌లైన్ ద్వారా ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. వీరంతా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్భుల్లాపూర్, ఎల్‌బీనగర్ స్థానాల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి ఫలితాలను తారుమారు చేశారు. అలా తొమ్మిది శివారు నియోజకవర్గాలలో టీడీపీ గెలుపుకు ఈ బోగస్ ఓట్లే కారణమయ్యాయి’ అని కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ నేత గొట్టిముక్కల పద్మారావు ఆరోపిస్తున్నారు. దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.
భారీగా బోగస్‌లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్లు ఎన్నికలకు నెల రోజుల ముందు దాకా 74.66 లక్షలుండగా, ఓటింగ్ నాటికి 81.42 లక్షలకు చేరిందంటే ఆన్‌లైన్‌లో ఓటర్ల నమోదు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కొత్తగా ఓటర్లుగా చేరిన వారిలో అత్యధికులు టీడీపీ మద్దతుదారులేనని సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఆన్‌లైన్ ద్వారాఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చే యాలని, తన సామాజికవర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ జిల్లాల్లో ఉన్న కనీసం ఇద్దరికి రాజధాని శివార్లలో ఓటు హక్కు కల్పించాలని చంద్రబాబు ఆదేశించిన ట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బోగస్ ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయని గొట్టిముక్కల అంటున్నారు.
కూకట్‌పల్లిలో అత్యధికం...
కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 50 వేల మంది ఓటర్లు మే 7న ఓటేసేందుకు సీమాంధ్ర జిల్లాలకు వెళ్లారు. 6వ తేదీన ఒక్క రోజే 4 లక్షల మంది ఇలా వెళ్లారు. అలాగే కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, సనత్‌నగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్ స్థానాల్లోనూ సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. వీరిలో చాలామంది ఇటు నగర శివారు నియోజకవర్గాల్లోనూ, అటు సీమాంధ్రలోని తమ స్వస్థలాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నది గొట్టిముక్కల ఆరోపణ. ఇక ఎన్నికలకు ముందు నెల రోజుల వ్యవధిలోనే కుత్బుల్లాపూర్‌లో 60 వేలు, శేరిలింగంపల్లిలో 50 వేల మంది ఓటర్ల జాబితాలో చేరారు. ఇలాంటి వారంతా అటు ఆంధ్రలోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరంతా ఇరు చోట్లా ఓటేయడం టీడీపీకి కలిసొచ్చిందని గొట్టిముక్కల పేర్కొన్నారు.
రెండు చోట్లా ఓటు హక్కు ఉన్నవారికి ఉదాహరణలు...
పేరు- దుర్గాప్రసాద్ దుపాటి
ఓటర్ ఐడీ కార్డు నెం.ఆర్‌డీవీ1426908
ఇంటి.నెం.5-1-3-3/2 సంగీత్‌నగర్
నియోజకవర్గం: కూకట్‌పల్లి
పేరు- ప్రసాద్ దుపాటి
ఇంటి.నెం.3-85/సి
ఓటర్ ఐడీ కార్డు నెం.ఆర్‌హెచ్‌ఏ0625491
మన్యవారిపాలెం, జగ్గంపేట నియోజకవర్గం,
తూర్పుగోదావరి జిల్లా
దుర్గాప్రసాద్ కలిదిండి
ఓటర్ ఐడీ కార్డు నెం.ఆర్‌డీవీ143662
ఇంటి.నెం.5-1-3-3/2 దయారావుగూడ
నియోజకవర్గం: కూకట్‌పల్లి
దుర్గాప్రసాద్ కలిదిండి
ఓటర్ ఐడీ కార్డు నెం.ఐడీఎస్0189704
ఇంటి.నెం.1-161, సీతనగరం
నియోజకవర్గం:మండపేట
తూర్పుగోదావరి జిల్లా