సన్న బియ్యం సుర్రుమంటోంది!
మిల్లర్ల చేతివాటంతో కిలో 40 నుంచి 50 రూపాయలకు..
హైదరాబాద్: బియ్యం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. నాలుగు నెలల క్రితం ధరలతో పోలిస్తే.. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం సన్న రకం రూ.40 నుంచి ఏకంగా రూ.50కు చేరింది. ఎన్నికలకు ముందు మిల్లర్లు చూపించిన చేతివాటంతో ప్రస్తుతమీ పరిస్థితి నెలకొంది. ఇక్కడ బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయంటూ తప్పుడు లెక్కలు చూపించి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు భారీగా బియ్యాన్ని తరలించారు. దీంతో తెలంగాణ జిల్లాల్లో సన్న బియ్యం కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని గమనించిన రాష్ట్ర సర్కారు పది జిల్లాల నుంచి బియ్యం బయటకు వెళ్లరాదని తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ పది జిల్లాల్లోనూ ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బియ్యాన్ని తరలించాలన్నా...అధికారుల అనుమతిని తీసుకోవాలని షరతు విధించింది.
ఎక్కువ ఉందని చెబుతూ..
కర్నూలు బియ్యంతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పండే సన్న రకం బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గతేడాది కాలంగా రాష్ట్రంలో పరిస్థితి మారింది. ఎన్నికల కాలం.. రాష్ట్ర విభజన ప్రక్రియ.. దీంతో ఇటు అధికారులు కానీ, అటు ప్రభుత్వం కానీ చాలా అంశాలను పట్టించుకోలేదు. ఇదే సమయాన్ని మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి జిల్లాలో బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని చెబుతూ.. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అనుమతిని ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరారు. అలా భారీ ఎత్తున సన్న రకాల బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించారు. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం కొరత కారణంగా ప్రస్తుతం ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రాంతంలో ప్రజల అవసరాల కోసం రోజూ సుమారు 3 వేల టన్నుల బియ్యం అవసరమని అంచనా వేస్తున్నారు. అంటే నెలకు 90 వేల టన్నుల బియ్యం కావాల్సి ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పంట చేతికి రావడానికి మరో నాలుగు మాసాల కాలం పడుతుంది. అంటే...అక్టోబర్‌లో కొత్త బియ్యం వస్తుంది. అప్పటి వరకు ఇప్పుడున్న నిల్వ బియ్యాన్నే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ నాలుగు నెలల కాలానికి 3.60 లక్షల టన్నుల బియ్యం అవసరముంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ధరలు మరింత భగ్గుమనే ప్రమాదముంది.