తిరుమలకు పోటెత్తిన భక్తులు
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
గదుల కోసం గంటల కొద్దీ నిరీక్షణ
తాగునీటి సమస్యపై జేఈవో సమీక్ష
తిరుమల: పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తుల క్యూలే కనిపిస్తున్నాయి. వేకువజాము నుంచే దర్శన క్యూలలో జనం భారీగా బారులుతీరారు. సర్వదర్శనం కోసం మొత్తం 31కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండిపోయారు. వెలుపల రెండు కిలోమీటర్ల మేర స్వామి దర్శనం కోసం క్యూకట్టారు. వీరికి 20 గంటలు, 13 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న కాలిబాట భక్తులకు 14 గంటలు, రూ.300 టికెట్ల భక్తులకు ఆరుగంటల తర్వాత స్వామి దర్శనా నికి అనుమతించనున్నారు. రద్దీ పెరగటంతో గదుల కోసం భక్తులు కనీసం నాలుగైదు గంటలు నిరీక్షిం చారు. గదులు లభించని భక్తులు యాత్రి సదన్‌లో లాకర్లు పొందేందుకు కూడా నిరీక్షించక తప్పలేదు. తలనీలాలు సమర్పించుకునేందుకు ప్రధాన కల్యాణ కట్టతోపాటు మినీ కల్యాణ కట్టల్లో మూడు గంటలపాటు పడిగాపులు కాచారు. గదులు లభ్యంకాక చాలామంది ఆరుబైటే నిద్రించారు. శని వారం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.21 కోట్లు లభించింది.
ప్రతి నీటిబొట్టునూ జాగ్రత్తగా వినియోగించాలి
వేసవి సెలవుల్లో రద్దీ వల్ల తిరుమలలో భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కోసం జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రతినీటి బొట్టునూ జాగ్రత్తగా విని యోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తిరుమలలోని జలాశయాల్లో ప్రస్తుతం 106రోజులకు సరిపడా తాగునీటి నిల్వలు ఉన్నాయన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు ప్రతి ఒక్క అధికారి సిద్ధంగా ఉండాలన్నారు.