
తిరుమలలో తోపులాట
మిన్నంటిన రోదనలు విజిలెన్స్, పోలీసుల అప్రమత్తతో తప్పినప్రమాదం
తిరుమల: తిరుమలలో శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో కాలిబాట క్యూలో తోపులాట చోటు చేసుకుంది. సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మూడురోజుల పాటు వరుస సెలవులు కావడంతో అనూహ్యంగా భక్తులు తరలి వచ్చారు. శనివారం అలిపిరి, శ్రీవారి మెట్టు, కాలిబాట మార్గాల నుంచి నడిచివచ్చే భక్తుల సంఖ్య రెట్టింపయింది. నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వృద్ధులు, చంటి బిడ్డల రోదనలు మిన్నంటాయి. విజిలెన్స్ అధికారి మల్లికార్జున, టూ టౌన్ ఎస్‌ఐ వెంకట్రమణ అక్కడున్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. నారాయణరిగి ఉద్యానవనంలోకి కాలిబాట భక్తులు రాకుండా గేటు మూసివేశారు. వెలుపల ఉన్న వారిని వరుసగా కూర్చోబెట్టారు. తర్వాత నిదానంగా లోనికి అనుమతిం చారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు 18 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తుం దని టీటీడీ ప్రకటించింది. భక్తులకు అల్పాహారం, మంచినీరు, చంటి బిడ్డలకు పాలు పంపిణీ చేశారు.
25 గంటల తర్వాతే సర్వదర్శనం
సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండిపోయారు. వెలుపల రెండు కిలోమీటర్ల మేర క్యూ విస్తరించింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు 25గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తుందని టీటీడీ ప్రకటిం చింది. గదుల కోసం భక్తులు అష్టకష్టాలు పడ్డారు. ప్రధానంగా రూ. 100నుంచి రూ. 1,000 వరకు అద్దె గదులు మంజూరు చేసే కేంద్రాల వద్ద వేకువజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో కనిపించారు. ఐదు నుంచి ఏడు గంటల పాటు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. తలనీలాలు సమర్పిం చేందుకు గంటల తరబడి ఎదురు చూశారు. శనివారం శ్రీవారికి హుండీ ఆదాయం రూ. 2 కోట్లు లభించిందని అధికారులు తెలిపారు.