సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహానికి హంద్రీ వరద తోడవడంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 1,03,150 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 845.70 అడుగుల్లో 71.44 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో 38,140 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి చేరుతున్నాయి. దీంతో సాగర్‌లో నీటి నిల్వ 173.66 టీఎంసీలకు చేరింది. గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 87,938 క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 75,621 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులకు జలకళ
రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. హంద్రీ నది పరవళ్లు తొక్కుతుండడంతో గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి నిల్వ 4.30 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర నదికి ప్రవాహం పెరిగినందున సుంకేశుల, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లు నిండుకుండలా మారాయి. అనంతపురం జిల్లాలో కురిసిన వర్షాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి నిల్వ 4.50 టీఎంసీలకు చేరింది. విశాఖపట్నం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల శారద నది నుంచి రైవాడ రిజర్వాయర్‌లోకి భారీగా వరద చేరుతోంది. ఇక తాండవ ప్రాజెక్టు 80 శాతం నిండింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు భూపతిపాళెం, ముసురుమిల్లి, జుర్రేరు వంటి చిన్న తరహా ప్రాజెక్టులు నిండాయి.
Comments
Please login to add a commentAdd a comment