
పోలవరం ప్రాజెక్టు వద్ద భారీ యంత్రం దగ్ధం
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఓ భారీ యంత్రం అగ్నికి ఆహుతి అయింది.
పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం ఓ భారీ యంత్రం అగ్నికి ఆహుతి అయింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఉపయోగించేందుకు ఈ భారీ యంత్రం ఎస్కలేటర్‌ను రూ.75 కోట్లతో జర్మనీ నుంచి కాంట్రాక్టు సంస్థ తెప్పించింది. స్పిల్‌వే చానల్ కోసం కొండను తవ్వుతుండగా జరిగిన ఈ ప్రమాదానికి షార్టు సర్క్యూటే కారణమని భావిస్తున్నారు.
ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థ యాజమాన్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ యంత్రం దగ్ధమవడంతో ప్రాజెక్టు పనులు నెమ్మదిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 30వేల ఘనపుటడుగుల మట్టిరాళ్లను వెలికితీయగల సామర్థ్యం ఉన్న ఈ భారీ యంత్రాన్ని అక్కడ సిబ్బంది ‘బాహుబలి’ అని పిలుచుకుంటారు.