
కోస్తా జిల్లాలలో భారీ వర్షం
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురిచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నెల్లూరు తీరంలో అల్పపీడనం ఏర్పడిందని, రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం వాతావరణ కేంద్రం తెలిపింది.
మాడుగుల మండలం పెద్దేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. 2 గేట్లు ఎత్తివేసి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తూర్పు గోదావరి, శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు కాకినాడలో మెయిన్ రోడ్డుతో పాటు పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోనసీమలోని ఆత్రేయపురం, కొత్తపేట, తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు మండలాల్లో పాలుపోసుకుని గింజ గట్టిపడే దశలో ఉన్న వరి చేలు నేలకొరిగాయి. అయితే ప్రస్తుత వర్షాల వల్ల పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా, నెల్లూరు నగరంలో కుండపోతగా వాన కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ అప్సర సర్కిల్, ఎన్‌జీవో కాలనీలు నీట మునిగాయి.