
పాల్తూరులో వర్షపు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్ద వంక
సాక్షి, అనంతపురం: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ‘అనంత’ పులకించింది. ఈ ఏడాది వర్షాభావంతో తడారిపోయిన ‘అనంత’కు జలకళ సంతరించుకుంది.నాలుగు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం డివిజన్లలో కాస్త తక్కువగా ఉన్నా మిగతా డివిజన్లలో భారీ వర్షాలు నమోదయ్యాయి. అందులోనూ తాడిపత్రి, గుంతకల్లు, శింగనమల, ఉరవకొండ, అనంతపురం, ధర్మవరం ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైంది. ఈ నాలుగు రోజుల్లోనే ఏకంగా 67 మి.మీ సగటు నమోదు కావడం విశేషం. గురువారం కూడా జిల్లా అంతటా 16 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమమయమయ్యాయి. అక్కడక్కడ రహదారులు దెబ్బతిన్నాయి.
దెబ్బతిన్న ఉద్యాన తోటలు
వంద ఎకరాల్లో పండ్లతోటలు దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తిం చారు. వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహించగా, అక్కడక్కడ చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటలు, పండ్ల తోటలు పచ్చదనం సంతరించుకోగా రబీ సాగుకు గంపెడాశతో రైతులు సన్నద్ధమవుతున్నారు.
జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం
బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. 16 మి.మీ సగటు నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ప్రస్తుతానికి 71.9 మి.మీ నమోదైంది. జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఈ ఖరీఫ్‌లో 283.5 మి.మీ గానూ 26 శాతం తక్కువగా 209.5 మి.మీ నమోదైంది. ఇంకా వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్తుండడంతో అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్న రబీ వ్యవసాయం జోరుగా సాగే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నల్లరేగడి భూములు కలిగిన తాడిపత్రి, గుంతకల్లు డివిజన్లలో మంచి వర్షాలు పడటంతో పప్పుశనగ సాగు విస్తీర్ణం పెరిగే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు.
చదవండి : వాల్మీకి కాదు... ‘గద్దలకొండ గణేష్
Comments
Please login to add a commentAdd a comment