భారీ వర్షాలకు వణికిపోతున్న ఉత్తరాంధ్ర
భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. ఆరు వారం రోజులు ఎడతెరిపి లేకుండా ముంచెత్తుతున్న వర్షాలు, వరదలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
శ్రీకాకుళంలో ఆదివారం భీకర వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు 30 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం వాసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. నాగావళి నదికి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆశించారు. 47 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జిల్లా కన్నూరుపాలెంలో 27 సెం.మీ వర్షపాతం నమోదైంది. కశింకోటలో 19 సెం.మీ, అనకాపల్లిలో 18 సెం.మీ, ఎస్రాయవరంలో 15 సెం.మీ వర్షం కురిసింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 21, ఎస్ కోటలో 15 సెం.మీ వర్షపాతం నమోదైంది.