దోపిడీ అ‘ధనం’ | heavy robbery | Sakshi
Sakshi News home page

దోపిడీ అ‘ధనం’

Published Wed, May 13 2015 4:10 AM | Last Updated on Sun, Apr 7 2019 3:28 PM

heavy robbery

పట్నంబజారు (గుంటూరు) : ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు  ఎదుర్కొంటున్నారు. బస్సులను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నా పూర్తి స్థాయిలో సఫలం కాలేదనే చెప్పాలి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం భారంగా మారుతోంది. ఈ నెల 6వ తేదీన ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో రీజియన్ పరిధిలోని అధికారులు హెవీ డ్రైవింగ్ లెసైన్సులు కలిగిన డ్రైవర్లు, పదో తరగతి విద్యార్హత కలిగిన వారిని కండక్టర్లుగా తీసుకున్నారు.

సుమారు 13 డిపోల్లో 200 మంది డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలిక విధుల్లోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ కార్మికలు మాత్రం విధులకు వచ్చి వెళుతున్నట్టు అధికారులు తెలిపారు. రీజియన్ పరిధిలో మొత్తం 1275 బస్సులు ఉన్నాయి. వాటిలో 1050 ఆర్టీసీవీ కాగా, 225 హైర్ బస్సులు. సమ్మె ప్రారంభం అయిన నాటి నుంచి డిపో నుంచే హైర్ బస్సులు తిరుగుతున్నా, ఆర్టీసీకి ఎలాంటి రసుం చెల్లించడం లేదు.

  కాంట్రాక్ట్ ప్రకారం ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం కూడా చెల్లించటం లేదు. అయితే గమ్యస్థానం ప్రకారం ఒక నిర్ధిష్ట మొత్తాన్ని సంస్థకు చెల్లించాలని అధికారులు వారికి సూచించి సర్వీసులకు పంపిస్తున్నారు. గమ్యస్థానం, ధరల పట్టికను వారికి అందజేశారు. అయితే వారిలో కొంత మంది మాత్రం టికెట్ ధరకు అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

టికెట్ ధర రూ.20 ఉంటే రూ. 40 వరకు తీసుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.  టికెట్లు ఇచ్చే పద్ధతి లేకపోవడంతో కొంత మంది సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రయాణికుల నుంచి అధికమొత్తంలో వసూలు చేయకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

 ప్రైవేట్ దందా....
 ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు వరంగా మారింది. రీజియన్ పరిధిలో నిత్యం 400 సర్వీసుల వరకు దూరప్రాంతాలకు వె ళుతుంటాయి. సమ్మె నేపథ్యంలో రీజియన్‌లోని 13 డిపోల నుంచి ఆర్టీసీకి చెందిన ఒక్క బస్సు కూడా దూరప్రాంతాలకు వెళ్లటంలేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాలకు ఒకటికి నాలుగు రెట్లు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

ఇలా ప్రయాణం భారంగా మారుతోందని చెబుతున్నారు. హైదరాబాద్‌కు టికెట్ రూ.400 ఉంటే రూ.1200 వరకు వసూలు చేస్తున్నారంటే ప్రైవేట్ దందాను అర్థం చేసు కోవచ్చు. అధికారులు స్పందించి ప్రైవేట్ బస్సుల దోపిడీని అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

 తాత్కాలిక సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం...
 సమ్మె నేపథ్యంలో విధుల్లో తీసుకున్న తాత్కాలిక సిబ్బందికి నిత్యం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పీవీ రామారావు చెప్పారు. అధికంగా వసూలు చేస్తున్నారనే విషయం తమ దృష్టికీ వచ్చిందన్నారు. టికెట్టు ధర కంటే అధికంగా వసూలు చేయొద్దని వారికి చెప్పటం జరిగిందన్నారు. ప్రస్తుతం టిమ్స్ వాడటం తాత్కాలిక సిబ్బందికి ఇబ్బందిగా ఉంటుందనే దృష్టితో నేరుగా చార్జీలు తీసుకుంటు న్నామన్నారు. అధిక చార్జీలు వసూలు చేయకుండా పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు చేపడతామన్నారు.
 - ఆర్‌ఎం రామారావు, గుంటూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement