సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీకమాసం, ఆదివారం కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో క్యూ లైన్ల వెలుపల భక్తులు నిరీక్షిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16గంటలు, నడక దారి భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. నిన్నటితో పెరటాశి శనివారాలు ముగిసినప్పటికీ శ్రీవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలి బాట మార్గాలు నడిచివచ్చే భక్తులతో కిక్కిరిసిపోయాయి.
కిటకిటలాడుతున్న శ్రీశైలం..
శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడుతోంది. శనివారం సాయంత్రానికి విపరీతంగా పెరిగిన రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. నేడు ఆదివారం, రేపు మొదటి కార్తీక సోమవారం కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశముంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు
శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం కురిసింది. ఒక్కరోజే హండీ ఆదాయం కోటిన్నర దాటింది. శనివారం ఒక్కరోజే భ్రమరాంబామల్లిఖార్జున స్వామివారికి కోటీ 62 లక్షల 78 వేల 88 రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని ఈవో నారాయణభరత్ గుప్తా వెల్లడించారు.
సాగర్‌కు పర్యాటకశోభ..!
నాగార్జున సాగర్‌ను సందర్శించే టూరిస్టుల కోసం మరో పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. గతవారం శ్రీశైలం దగ్గర అక్టోపస్ వ్యూ పాయింట్‌ను ప్రారంభించిన తెలంగాణ అటవీ శాఖ ఈసారి సాగర్ సమీపంలో వాచ్ టవర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా అటవీశాఖ వాచ్ టవర్‌ను నిర్మించింది. హైదరాబాద్ - నాగార్జున సాగర్ రోడ్డులోని నెల్లికల్ ఫారెస్ట్ బ్లాక్ ప్రాంతంలో ఈ వాచ్ టవర్ ను ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి 1050 అడుగుల ఎత్తులో ఉండే ఈ వాచ్ టవర్ నుంచి అటవీ అందాలతో పాటు కృష్ణా నదీ అందాలను, నాగార్జున సాగర్ డ్యామ్ బ్యాక్ వాటర్‌ను కూడా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment