భారీఎత్తున దరఖాస్తులు
* 3,124 మద్యం దుకాణాలకు 65,174 దరఖాస్తులు
* ఒక్క దరఖాస్తూ రానివి 354 షాపులు
* దరఖాస్తుల రూపంలో రూ.224 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. భారీఎత్తున దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,478 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 3,124 మద్యం దుకాణాలకు 65,174 దరఖాస్తులు అందాయి. అయితే 354 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసినప్పటికీ.. ఆదివారం తెల్లవారుజాము వరకు కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు ఫీజు కింద రూ.224 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌శాఖకు సమకూరింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించలేదు. దీనిపై ఎక్సైజ్ కమిషనర్ రాసిన లేఖకు ఎన్నికలసంఘం నుంచి సోమవారం వివరణ రానుంది.
ఈ రెండు జిల్లాల్లోనూ నోటిఫికేషన్ జారీచేస్తే దరఖాస్తుల రూపంలో ఆదాయం రూ.250 కోట్లు దాటుతుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతేడాది మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిశాక 743 షాపులకు ఒక్క దరఖాస్తూ రాలేదు. ఈ దఫా లెసైన్సు కాలపరిమితి రెండేళ్లు కావడంతో పోటీ ఎక్కువగానే ఉంది.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు...
రాష్ట్రంలో అన్ని జిల్లాలకంటే రాజధాని ప్రాంతమైన గుంటూరులో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. 11,548 దరఖాస్తులు అధికారికంగా ప్రకటిస్తున్నా.. పెదకూరపాడు, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఇంకా దరఖాస్తుల క్రోడీకరణ ప్రక్రియ పూర్తికానట్లు సమాచారం. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
వైఎస్సార్ జిల్లాలో అత్యల్పంగా 190 దుకాణాలకు 2,161 దరఖాస్తులందాయి. ఒక్క దరఖాస్తు రాని దుకాణాలకు సోమవారం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస శ్రీ నరేష్ తెలిపారు. సింగిల్ దరఖాస్తులు వచ్చిన షాపులను దరఖాస్తు చేసినవారికే కేటాయిస్తామన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆయా జిల్లాల్లో కలెక్టర్ల సమక్షంలో లాట్ల విధానంలో లాటరీ తీసి షాపులకు ప్రొవిజనల్ లెసైన్సు కేటాయించనున్నట్లు వివరించారు.