మంచినీళ్లు లేవు
Published Sun, Aug 18 2013 5:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :జోరు వానలు కురుస్తున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా నీటి వరదలే. తెరిపిలేని వానలతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలే కాదు... పొలాలు, చెలకలు సైతం నీటితోకనిపిస్తోంది. ఐదేళ్లలో ఎప్పడూ లేనంత ఎక్కువగా జిల్లాలో వర్షాలు కురిసినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇలా పుష్కలంగా నీళ్లున్నా... గ్రామీణ ప్రాంతాలకు మాత్రం తాగునీరు దొరకడం లేదు. గ్రామాల్లో తాగునీటి సరఫరా చేసే అన్ని పథకాలకు కరెంటు సమస్య వచ్చి పడింది. ఇది కరెంటు లేక కాదు... కరెంటు బిల్లులు చెల్లించక. గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ పరిధిలోని అన్ని పథకాలకు రెండేళ్లుగా కరెంటు బిల్లులు చెల్లించడం లేదు.
ఇలా పేరుకుపోయిన బిల్లులు రూ.12 కోట్లకు చేరుకున్నాయి. కరెంటు బిల్లు చెల్లించని వారి విషయంలో ప్రైవేటు వినియోగదారుల తీరుగానే ఉండాలనే ఆదేశాలతో... విద్యుత్ శాఖ జిల్లా అధికారులు అన్ని తాగునీటి సరఫరా పథకాలకు కరెంటు కట్ చేసుకుంటూ పోతున్నారు. ఒకేసారి జిల్లా వ్యాప్తంగా చేయకుండా ఒక్కో ప్రాంతంలో ఒకసారి కట్ చేస్తున్నారు. బకాయిలు భారీగా ఉండడంతోనే విద్యుత్‌శాఖ అధికారులు ఈ పని చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో ప్రభుత్వ తాగునీటి వ్యవస్థ స్తంభించిపోతోంది. ప్రజలకు నాణ్యమైన తాగునీరు కరువై శుద్ధి చేయని నీరే దిక్కవుతోంది. అసలే వర్షాకాలం కావడంతో ఈ నీరు తాగి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.
ఎన్నికల ఎఫెక్ట్
స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడంతో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు పాలకవర్గాలు లేవు. పాలకవర్గాలు లేకపోవడం వల్లే గ్రామీణ తాగునీటి సరఫరా పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. కరెంటు బిల్లులు పేరుకుపోయిన విషయం వాస్తమేనని, కరెంట్ కట్ చేస్తున్నారని గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు. కేంద్రం నిధులివ్వకపోగా... రాష్ట్రం కూడా పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో తాగునీటికి తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు.
అన్ని పథకాలకు...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్వహించే నీటి పథకాలతోపాటు ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం ఉన్న పథకాలకు సైతం కరెంట్ కట్ చేస్తున్నారు. సమగ్ర శాశ్వత నీటి సరఫరా(సీపీడబ్ల్యూఎస్) కింద జిల్లాలో మల్యాల, గంగాధర, వెంకట్రావుపల్లి, రామడుగు, తుమ్మనపల్లి(హుజూరాబాద్), బెజ్జంకి, గన్నేరువరం, మంథని, మంథని రూరల్, బీర్‌పూర్, ఇందుర్తి, కొత్తూరు(ఇల్లంతకుంట) పథకాలు ఉన్నాయి. ఈ 12 పథకాలకు కలిపి రూ.4 కోట్ల కరెంటు బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో ఒక్క ఇందుర్తి సీపీడబ్ల్యూఎస్‌కే రూ.2 కోట్ల బకాయిలున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల జోక్యంతో ఒకటిరెండు రోజులు కరెంటు పునరుద్ధరిస్తున్నా... ఆ వెంటనే మళ్లీ కటింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత నిధులు వచ్చే వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది.
Advertisement