
అర్ధరాత్రికి మరింత బలపడనున్న తుపాను
విశాఖపట్నం: హెలెన్ తుపాను ఈ అర్ధరాత్రికి మరింత బలపడనుంది. వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం దిశ మార్చుకున్న తుపాను విశాఖకు 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి ఉదయానికి నెల్లూరు-మచిలీపట్నం మధ్యలో ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అన్ని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో హెలెన్ తుపాన్ తీరం దాటుతుందనే హెచ్చరికలతో కలెక్టర్ విజయ్ కుమార్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. 28 తీర ప్రాంత గ్రామాల్లోని సుమారు 30వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా కావలి సముద్ర తీరంలో రెండున్నర మీటర్ల మేర సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు పడవలను, వలలను సురక్షితప్రాంతానికి తరలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్రపు అలల తాకిడికి ఫిషింగ్ బోట్ మునిగిపోయింది. అందులోని ఆరుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు 6 విపత్తు నివారణ బృందాలను పంపారు. రెవిన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.